Yellow Alert: ఎల్లో అలెర్ట్.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రత్తలు, రేపు ఎల్లుండి విపరీతమైన పొగమంచు..
తెలుగు రాష్ట్రాలో చలి విపరీతంగా పెరుగుతుంది. నిన్న మొన్నటి వరకు చెదురు మొదురు వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు లేవు కానీ చలి తీవ్రత పెరుగుతుంది.
ఆదివారం మధ్యాహ్నం పొడి వాతావరణం కనిపించింది. కానీ, మళ్లీ రాత్రులు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే రేపు 17 నుంచి 28, ఎల్లుండి 11 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవతాయని ఎల్లో అలెర్జ్ ఇచ్చింది వాతావరణ శాఖ.
అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది. అంతేకాదు రానున్న 5 రోజుల పాటు విపరీతమైన పొగమంచు కూడా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ముఖ్యంగా ఉదయం పూట వాహనాలు నడిపేవారు లైట్లు ఆన్ చేసుకుని మాత్రమే వెళ్లాలని లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక సీజనల్ జబ్బులు కూడా చుట్టుముడుతున్నాయి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోండి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు స్వెటర్లు, టోపీలు కచ్చితంగా ధరించాలి. దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.