Vinesh Phogat: వినేష్ ఫోగట్ ఎవరు.. వరల్డ్ నెం.1 రెజ్లర్ కు షాక్ ఇచ్చిన భారత సివంగి గురించి ఈ విషయాలు తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అథ్లేట్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే భారత్ ఖాతాలో మూడు రజతాలు వచ్చిచేరాయి. రెండు కాంస్యపతకాలను మనూబాకర్ గెల్చుకొగా,మరోపతకం స్వప్నిల్ సాధించాడు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో పతకం భారత్ ఖాతాలో చేరనుంది.
తొలుత జపాన్ స్టార్ సుసై యుయ్‌ని ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఉక్రెయిన్ ఒక్సానాను ఓడించి సెమీస్ చేరుకుని సంచలనం సృష్టించింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో వినేశ్ ఫోగట్‌కు ప్రారంభంలో మ్యాచ్ చాలా టఫ్ గా అనిపించింది. కానీ ఫోగట్.. మెరుపు ప్రదర్శన చేసి జపాన్‌కు చెందిన సుసాకిని 3-2తో ఓడించింది. ఈ ఓటమితో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ సుసాకి ఆశ్చర్యనికి గురైనట్లు తెలుస్తోంది.
సుసాకి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. ప్రపంచ చాంపియన్‌ను ఓడించి పతకాల ఆశలను వినేష్ ఫోగట్ పెంచుకుంది. ఈ గెలుపుతో వినేష్ ఫోగట్ దాదాపు ఒక మెడల్ ను ఖాయం చేసింది.
25 ఏళ్ల సుసాకి టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు బౌట్‌లలో ఒక్క పాయింట్ కోల్పోకుండా స్వర్ణం గెలుచుకుంది. అలాంటి ప్లేయర్‌ను ఓడించి వినేశ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సుసాకిని పడగొట్టిన మొదటి అంతర్జాతీయ రెజ్లర్‌గా వినేష్ చరిత్ర సృష్టించింది.
ఏడాది క్రితం సొంతగడ్డపై వీధుల్లో పోరాటం చేసిన ఆమె ఒక దశలో ఒలింపిక్స్ ఆడేందుకు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంది. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) వర్గం అడుగడుగునా అడ్డు పడినా మొక్కవోని సంకల్పంతో లక్ష్యంవైపు కదిలింది. ఇప్పుడు విశ్వవేదికపై తన ఉడుంపట్టుతో దేశ ఖ్యాతిని, గౌరవాన్ని పెంచుతోంది. దాంతో, యావత్ భారతం ఆమె ప్రతిభకు ఫిదా అవుతుంది.
మహిళా రెజ్లర్ల తరఫున న్యాయం కోసం పోరాడిన ఆమెను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ డాటర్ ఆఫ్ ఇండియా కన్నీళ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఆమె ఇప్పుడు దేశ గౌరవాన్ని పెంచేందుకు విశ్వ వేదికపై యోధురాలిలా పోరాడుతోంది. దాంతో, నెటిజన్లు వినేశ్‌ను ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ భారత్ తరపున సత్తాచాటున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్స్(2019, 2022)లో ఆమె 53 కిలోల విభాగంలో కాంస్య పతకంసాధించింది. 2018 ఆసియా క్రీడల్లో 50 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె ఏకంగా స్వర్ణ పతకం కొల్లగొట్టింది. అయితే.. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న అప్పటి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా వినేశ్ ఫోగట్ తిరుగుబాటు చేసింది. తోటి రెజ్లర్లు భజ్‌రంగ్ పూనియా, సాక్షి మాలికలతో ఫోగట్ ఉద్యమించిన విషయం తెలిసిందే.
వినేష్ ఫోగట్ ది హర్యానా రాష్ట్రం. ఆడపిల్లలకు కుస్తీలో శిక్షణనిస్తున్నందుకు వినేశ్ పెద్దనాన్న మహావిర్ ను, తన కుమార్తెను శిక్షణ ఇప్పిస్తున్నందుకు ఆమె తండ్రి రాజ్ పాల్ నూ గ్రామస్థులు దాదాపుగా వెలివేశారు. కానీ వారి సంఘ్ నియమాలకు వ్యతిరేకంగా వినేశ్ పెద్దనాన్న, తండ్రులు ఆమెకు ట్రైనింగ్ ఇప్పించారు. ఇదిలా ఉండగా.. మాజీ జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగట్ తమ్ముడు రాజ్ పాల్ కుమార్తె వినేశ్. ఆమె కజిన్లు గీతా ఫోగట్, బబితా కుమారిలు అంతర్జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారిణులు. వారి స్ఫూర్తితోనే వినేశ్ కుస్తీ క్రీడలోకి అడుగుపెట్టారు