బిగ్ బాస్ 11 పార్టిసిపెంట్ జుట్టు పట్టుకుని లాగిన లేడీ
అనుకోని పరిణామంతో హినా ఖాన్ అక్కడే కుప్పకూలినంత పనిచేసింది.
బిగ్ బాస్ 11 సీజన్ తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ఆ కార్యక్రమంపై బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారా అని ఆడియెన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ 11 సీజన్ చివరి వారంలోకి అడుగిడనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ షోలో వికాస్ గుప్త, శిల్ప షిండే, హినా ఖాన్, లవ్ త్యాగి, పునీష్ శర్మ, ఆకాష్ డడ్లానీ టాప్ సిక్స్‌గా మిగిలారు. ఈ వారమే ఓటింగ్ లైన్స్ కూడా మూసేయడంతో నామినేటెడ్ పార్టిసిపెంట్స్ అయిన వికాస్ గుప్త, శిల్ప షిండే, హినా ఖాన్, లవ్ త్యాగిలను ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌కి పంపించి అక్కడ తమ తమ అభిమానుల నుంచి ఓట్లు అభ్యర్థించుకునేందుకు అవకాశం కల్పించారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. అందుకు షాపింగ్ మాల్‌లో ఓ భారీ బోను లాంటి వేదికను ఏర్పాటు చేసి అందులో నుంచే అభిమానులతో ముచ్చటించే విధంగా ఏర్పాటు చేశారు.
బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ రాకతో షాపింగ్ మాల్‌లోనూ భారీ సందడి నెలకొంది. అభిమానుల రాకతో అక్కడ దాదాపు తొక్కిసలాంటి వాతావరణం ఏర్పడింది. అయితే, ఇదే క్రమంలో బోను లాంటి వేదికపైకి వెళ్తున్న హినా ఖాన్‌ని ఓ గుర్తుతెలియని వ్యక్తి గట్టిగా జుట్టు పట్టుకుని లాగడం కలకలం సృష్టించింది. ఆ వ్యక్తి గట్టిగా జుట్టు పట్టుకుని లాగడంతో హినా ఖాన్ భరించలేని బాధతో అక్కడే కుప్పకూలినంత పనిచేసింది. అయితే, అదే సమయంలో ఆమె పక్కనే వున్న మరో పార్టిసిపెంట్ అయిన వికాస్ గుప్త ఆమెని ఆ జనం నుంచి వేరు చేసి ఆమెని సురక్షితంగా బోనులోకి తీసుకెళ్లాడు.
ఓవైపు హినా ఖాన్‌పై దాడి జరిగి, ఆ బాధతో ఆమె కేకలు పెడుతున్నప్పటికీ.. ఆ పక్కనే వున్న శిల్ప మాత్రం తనకేమీ పట్టనట్టు తన అభిమానులతో షేక్ హ్యాండ్ ఇస్తూ గడిపేయడం ఆమెపై విమర్శలకి తావిచ్చింది. హినా ఖాన్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సైతం కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలో హినా ఖాన్ జుట్టుపట్టుకుని లాగిన వారి చేతికి గాజులు ధరించి వుండటాన్నిబట్టి చూస్తోంటే.. హినా ఖాన్ అంటే గిట్టని వారు కానీ లేదా శిల్పకు పోటీగా వుందనే కోపంతో శిల్ప అభిమాని కానీ ఎవరైనా ఈ దాడికి పాల్పడి వుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.