ఈ రోజు మొబైల్ బ్యాంకింగ్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయం ఉండాల్సిందే. అయితే.. ఆ సదుపాయం అందరికీ ఉండదు కదా. అప్పుడప్పుడు ఇంటర్నెట్ సిగ్నల్స్ లేని ఏరియాలకు వెళ్లినప్పుడు.. లేదా అత్యవసర సమయాల్లో డేటా పనిచేయనప్పడు మనం ఇబ్బంది పడవచ్చు. అలాంటప్పుడు ట్రాన్సాక్షన్స్ చేయాలంటే వీలవ్వదు కదా. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతి ద్వారా మీరు మీ ఫోన్లో డేటా ఉన్నా లేకపోయినా.. మొబైల్ బ్యాంకింగ్ చేయచ్చు.


అయితే ఈ పని చేయాలంటే ముందు మీ బ్యాంకు వద్దకు వెళ్లి మీరు మీ మొబైల్ నెంబరు నమోదు చేయించుకోండి. ఈ సేవలు పొందాలంటే ముందు మీరు మీ మొబైల్ నుండి *99# అనే కోడ్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ బ్యాంకు ఐపీఎస్‌సీ కోడ్‌ని *99#కి అదనంగా యాడ్ చేయాలి. అప్పుడు వెంటనే మీ సాధారణ మొబైల్‌లోనే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ డిటేల్స్ తెలుసుకోవచ్చు. అయితే డబ్బు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే మాత్రం మీ మొబైల్ పిన్ నెంబరు ఇవ్వాలి. ఈ బ్యాంకింగ్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఎప్పుడైనా సరే మీ మొబైల్ నుండి లావాదేవీలు చేసుకోవచ్చు. సెలవు దినాలలో కూడా సర్వీస్ ఆగదు.