Tomato Thulabharam Viral Video : అనకపల్లి జిల్లా : దేశంలో టమాటా ధరలు భారీగా పెరగడంతో టమాటాల గురించి ఎప్పుడూ చూడని చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టమాటాల గురించి దేశం నలుమూలలా నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక చిత్రవిచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంటూనే ఉంటోంది. ఒక రోజు టమాటాల పంట చోరీ అయితే, ఇంకో రోజు టమాటాల దుకాణంలో దొంగలు పడటం జరిగింది. మరొక రోజు టమాటాల వ్యాపారి తన దుకాణం ఎదుట బౌన్సర్లను నియమించుకున్న ఘటన.. ఇలా నిత్యం ఏదో ఒక ఘటనతో టమాటాల ధరలు వార్తల్లో ఉంటున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సామాజిక మాధ్యమాలలో అయితే టమాటాలపై మీమ్స్‌కి​, జోక్స్​కి కొదువేలేదు. టమాటాలను ఎవరైనా కొంటే.. మీరు రిచ్ బ్రో అంటూ జోక్స్ వేసుకుంటున్నారు. టమాటాల వ్యాపారిపై ఐటి రైడ్స్ అంటూ, టమాటాల చోరీ అంటూ వెరైటీ వెరైటీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి విచిత్రమైన సంఘటనే ఒకటి అనకాపల్లి జిల్లాలో జరిగింది. 


అనకాపల్లి జిల్లా నూకాలమ్మ ఆలయంలో ఒక భక్తుడు టమోటాలతో తులాభారం ఇచ్చారు. ప్రస్తుతం కేజీ టమాటా 120కి తగ్గకుండా ఉండటంతో ఆలయం ఆవరణలో జరిగిన ఈ తులాభారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా అయితే, ఒక్కోసారి కిలో టమాటా రూ. 10 కూడా పలికిన టమాటా ప్రస్తుతం ఖరీదైన కూరగాయగా మారడంతో ఈ తులాభారానికి ప్రత్యేకత సంతరించుకుంది. దేవుడిని దర్శించుకోవడానికని ఆలయానికి వచ్చిన భక్తులు తాము వచ్చిన పని పక్కన పెట్టి ఈ తులా భారం వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఇంకొంతమంది తమ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లకు పని చెప్పి ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించసాగారు. 


అనకాపల్లికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య తులాభారం నూకాలమ్మ ఆలయంలో జరిగింది. 51 కేజీల టమాటాలతో తులాభారం నిర్వహించారు. అనంతరం బెల్లం, పంచదారలను సైతం తులాభారంగా ఇచ్చి తమ మొక్కును తీర్చుకున్నారు. వీటిని అమ్మవారి నిత్యాన్నదానం కోసం ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. ఏదేమైనా ఈ దృశ్యాన్ని రికార్డు చేసిన భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని స్వయంగా చూసిన భక్తులు, ఇంటర్నెట్లో చూసిన నెటిజెన్స్ దీనిపై స్పందిస్తూ.. ఇది భక్తితో చేసిన పనో లేక టమాటా ధరలపై చేసిన నిరసన కార్యక్రమమో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు.. టమోటాల ధరల ఆకాశన్నంటున్న ప్రస్తుతం తరుణంలో ఈ ఘటన నేషనల్ న్యూస్ హెడ్ లైన్స్‌లో నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.