కెమెరా అంటే ఏమిటో కూడా పూర్తిగా ప్రజలకు అవగాహన లేని రోజుల్లో రాబర్ట్ కార్నిలస్ అనే వ్యక్తి తన స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చిన ఓ చిన్న కెమెరాతో తంటాలు పడుతూ..తన ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించాడట. అలా ప్రయత్నిస్తూ తన ఫోటోని తానే తీసుకున్నాడు. అయితే ఆ ఫోటోని సెల్ఫీ అని ఎవరూ పిలవలేదు. 2002లో నాథన్హోప్ అనే ఒక ఆస్ట్రేలియన్ పౌరుడు సెల్ఫీ అనే పేరును తొలిసారిగా వాడారు. 2013లో ఆక్స్‌ఫర్డు డిక్షనరీ ఇదే పేరుని తమ డిక్షనరీలో పొందుపరిచింది. 2017 నాటికి  సెల్ఫీ అనే పదం ఎంత పాపులర్ అయిందంటే, సోషల్ మీడియాలో సెల్ఫీలు తీసుకొని పెట్టుకోకపోతే ఏదో పెద్ద నేరం అన్నట్లు ఫీలైపోతున్నారు జనాలు. ఎవరికి వారే  వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకుంటూ తమ సెల్ఫీ ముచ్చట్లు తీర్చుకుంటున్నారు.