Somvati Amavasya Shani jayanthi 2022: శివో అభిషేక ప్రియః అన్నారు పెద్దలు. అంటే గుక్కెడు నీళ్లు నెత్తిన గుమ్మరిస్తే చాలు మహాదానందభరితుడు అవుతాడు పరమేశ్వరుడు. ఇక భక్త శ్రద్ధలతో అభిషేకం చేస్తే శీఘ్రమే ప్రసన్నుడవుతాడు. అందునా సోమవారం అంటే భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమవారం నాడు చేసే అభిషేకానికి విశేష ఫలితం ఉంటుంది.  అమావాస్యతో కూడిన సోమవారం నాడు కనుక పరమేశ్వరుడిని ఆరాధిస్తే.. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, ధన వస్తు, వాహనాదులు సమకూరతాయి. ఇలా సోమవారం, అమావాస్య ఒకే రోజు వస్తే.. దాన్ని సోమావతి అమావాస్యగా వ్యవహరిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమ శబ్దానికి చంద్రుడు అని అర్థం. సోమావతి అమావాస్య నాడు  చంద్రుడు తొలిసారిగా శివుడిని పూజించి విశేష ఫలితాలు పొందినట్లు పురాణగాథలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. తన అల్లుడైన పరమేశ్వరుడిని అమవానించే తలంపుతో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెడతాడు. శివుడికి తప్ప మిగిలిన అందరు దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులకు ఆహ్వానాలు పంపుతాడు. ఇది తెలిసి శివుడి భార్య అయిన సతీదేవి .. దక్ష యజ్ఞానికి వెళ్లాలని భావిస్తుంది. నిరీశ్వర యాగానికి వెళ్లొద్దనీ.. పిలవని పేరంటానికి వెళ్లడం మంచిది కాదంటూ పతి దేవుడైన పరమేశ్వరుడు ఎంత వారించినా వినదు. యజ్ఞానికి వచ్చిన సతీ దేవిని దక్షుడు తీవ్రంగా అవమానించడంతో తనను తాను ఆహుతి చేసుకుంటుంది. సతీ దేవి మరణంతో కోపోద్రేకుడైన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడు సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు.


శివ గణాలతో కలిసి యాగశాలలో స్వౌర విహారం చేస్తాడు వీరభద్రుడు. శివుడికి ఆహ్వానం లేని యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావబాదతారు. అలా శివగణాల చేతుల్లో దెబ్బలు తిని గాయపడ్డాడు చంద్రుడు. దక్షుడి కుమార్తెలను వివాహం చేసుకున్న చంద్రుడు.. శివుడికి తోడల్లుడు. శివగణాల చేతుల్లో గాయపడిన చంద్రుడు పరమేశ్వరుడిని శరణు వేడుకుంటాడు. భక్తసులభుడైన పరమేశ్వరుడు చంద్రుడికి శారీరక బాధల నుంచి విముక్తికి తరుణోపాయం చెబుతాడు. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి ఉందని ఆ రోజు తనను అభిషేకిస్తే అన్ని బాధలు నశిస్తాయని వరమిస్తాడు. అలా చంద్రుడు సోమావతి అమావాస్య నాడు శివుడిని ఆరాధించి ఆరోగ్య వంతుడయ్యాడు.


సోమావతి అమావాస్య నాడు ఏం చేయాలి ?


సోమావతి అమావాస్య నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి.. తల స్నానం చేయాలి. వీలైతే సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేయాలి. దైనందిక, నిత్య అనుష్టాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాకా..శివుడిని షోడశోపచారాలతో పూజించాలి. పంచామృతాలు, శుద్ధ జలాలతో శివలింగాన్ని అభిషేకించాలి. ఆలయాల్లో కానీ, ఇళ్లలో కానీ శివలింగాన్ని అభిషేకించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఇవి కుదరని వారు కనీసం పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ..గడిపినా పుణ్యమే.


మూగజీవాలకు ఆహారం, నీరు అందించడం వల్ల ఉత్తరోత్తర జన్మల్లో ఆకలిదప్పికలతో బాధపడాల్సిన పని ఉండదు. సర్వవ్యాపి అయిన శంకరుడు.. అన్ని జీవరాశుల యందు ఉంటాడని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఏ జీవికి మేలు చేసినా.. ఆనందించేది పరమేశ్వరుడే. అందుకే ప్రతి రోజూ భూత దయతో ఉండటం మానవధర్మాల్లో ఒకటి. కనీసం విశేష దినాల్లోనైనా ఆ పని చేయాలని పెద్దలు చెబుతారు.


శని జయంతి


శ్రావణ మాసం తర్వాత వ్రతాలకు విశేషమైన మాసం జేష్ఠం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్ర సంచారం జేష్ఠ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్లే ఈ నెలకు ఆ పేరు వచ్చింది. జేష్ఠ పౌర్ణమి నాడు వట సావిత్ర వత్రం చేస్తారు. ఇక జేష్ఠ అమావాస్య నాడు సూర్యుడు, ఛాయా దేవిల గర్భాన శని దేవుడు జన్మించాడు. కృష్ణ వర్ణుడు, కాకవాహనుడైన శనిదేవుడిని భక్తితో ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం పొందుతారు.


 కోణస్త పింగళ బభ్రు:
కృష్ణో రౌద్రా౦తకో యమ:
సౌరి శనైశ్చరో మంద:
పిప్పాలా దేవా సంస్తుత:


అంటూ శని అనుగ్రహం కోసం వేడుకున్న వారికి శుభాలు కలుగుతాయని శాస్త్రవచనం. శని దేవుడిని ఆయన జయంతి రోజు ప్రార్థిస్తే .. ఆయన మరింతగా ప్రసన్నుడవుతాడు.


 మే 30 సోమావతి అమావాస్యతో పాటు శని జయంతి కూడా కావడం ఒక విశేషమైతే.. 30 ఏళ్ల తర్వాత తన జన్మ రాశి అయిన కుంభ రాశిలో శని ఉండటం మరో విశేషం. దీంతో పాటు సర్వార్థ సిద్ధి, సుకర్మ యోగాలు ఇదే రోజు ఏర్పడతాయి. దాంతో దానధర్మాలకు అత్యుత్తమ రోజుగా పండితులు చెబుతున్నారు. జేష్ఠ మాసంలో గ్రీష్మ తాపం అధికంగా ఉంటుంది కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులు దానం చేయడం అత్యంత పుణ్యప్రదం.


ఈ రోజు చేసే దానధర్మాల వల్ల పాపం నశిస్తుంది. కుండతో నీరు, గొడుగు, పాదరక్షలు, ఆహారం దాన చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల శని, చంద్ర దోషాలు తొలిగిపోతాయని చెబుతారు. శనికి నలుపు ఇష్టమైన రంగు అందుకే నల్లని వస్త్రాలతో నిండిన కాడ దానం చేయడం ఉత్తమం. సోమావతి అమావాస్య నాడు మర్రిచెట్టును పూజించాలి. నీళ్లు పోసి భక్త శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాపాలు నశిస్తాయి.


Also read: Shani Jayanti 2022: శని జయంతి రోజు తప్పక పాటించాల్సిన 9 నియమాలు... పాటించకపోతే జీవితం కష్టాలమయం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook