Vaishno Devi Temple Trip: ఈ ఒక్క గుడికి వెళ్తే.. మరో 10 పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు
Vaishno Devi Temple Trip: సరదాగా హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు లేదంటే ఏదైనా ఆద్యాత్మిక యాత్రలకు వెళ్లినప్పుడు పనిలో పనిగా అక్కడే చుట్టుపక్కల ఉన్న మరిన్ని ఆలయాలు లేదా అందమైన పర్యాటక ప్రదేశాలు చూసి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇదిగో వైష్ణో దేవి యాత్రకు వెళ్లే వారికి కూడా అలాంటి అవకాశమే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది నుంచి 10 ప్రదేశాలు చుట్టేసి రావొచ్చు.
Vaishno Devi Temple Trip: మనం ఏదైనా యాత్రలకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా దైవ దర్శనం కోసం వెళ్లినప్పుడు పనిలో పనిగా అక్కడే చుట్టుపక్కల ఉండే మరిన్ని గుళ్లు -గోపురాలు లేదా టూరిస్ట్ ప్రదేశాలు చూసి రావాలని అనుకుంటాం కదా. ఎందుకంటే మళ్లీ అంత దూరం వెళ్తామో లేదో లేదంటే ప్రత్యేకంగా హాలీడే ప్లాన్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సమయం కూడా కావాలి. అందుకే వీలైతే ఒకే తీర్థ యాత్రలో వీలైనన్ని ఎక్కువ పర్యాటక ప్రాంతాలు కవర్ చేయాలి అనే ఉద్దేశంతోనే అలా ప్లాన్ చేసుకుంటాం. కానీ అన్నిసార్లు అది కుదరదు. కానీ ఇదిగో వైష్ణో దేవి యాత్రకు వెళ్లే వారికి మాత్రం కొంచెం తీరిగ్గా ప్లాన్ చేసుకుంటే అక్కడే కనీసం మరో ఐదు, ఆరు నుంచి పది వరకు పర్యాటక ప్రదేశాలు కవర్ చేసుకుని రావొచ్చు. ఒకే యాత్రలో అన్ని యాత్రా స్థలాలు కవర్ చేయడం అనేది అమేజింగ్ ఫీలింగ్ కదా.. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ? వైష్ణో దేవి యాత్రకి వెళ్లి కవర్ చేసే యాత్రా స్థలాల గురించి తెలుసుకుందాం పదండి.
నౌ దేవి మందిర్ :
నౌ దేవి మందిర్ అంటే దుర్గా దేవిని తొమ్మిది రూపాల్లో కొలిచే పుణ్యక్షేత్రం అన్నమాట. ఇక్కడ ఒకే చోట 9 గుహలు ఉన్నాయి. ఒక్కో గుహలో ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని నవరాత్రా మందిర్ అని లేక నవదుర్గా మందిర్ అని కూడా పిలుస్తుంటారు. వైష్ణో దేవి మందిరం ఉన్న కాట్రా బేస్ క్యాంప్ అయిన కాట్రాకు అతి సమీపంలోనే ఈ నౌ దేవి మందిర్ ఉంది.
బాబా ధన్సార్ :
బాబా ధన్సార్ ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ వానా కాలంలో కనిపించే జలపాతాలు ఇక్కడికొచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పైగా ఈ ప్రదేశంలోనే ఒక శివాలయం ఉంటుంది. అంటే ఇక్కడికి వెళ్తే శివుడిని దర్శనం చేసుకోవడంతో పాటు ఆ జలపాతాల అందాలు చూసి రావొచ్చు. ఇది వైష్ణో దేవి మందిరం ఉన్న కాట్రా బేస్ క్యాంప్ నుంచి 15 కిమీ దూరంలో ఉంటుంది.
సనాసర్ :
సనాసర్ అనేది ఒక అందమైన హిల్ స్టేషన్ ప్రాంతం. దీనిని జమ్మూలో ఉన్న మినీ గుల్మార్గ్ గా పిలుస్తుంటారు. ఇది కాట్రాకు అతి సమీపంలోనే ఉన్న పట్నిటాప్ అనే హిల్ స్టేషన్ నుంచి 17 కిమీ దూరంలో ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ నుండి చూస్తే... మంచుతో కప్పినట్టుగా ఉన్న పర్వతాలు ఒకవైపు, పచ్చదనం కప్పుకున్నట్టుగా ఉన్న అడవులు మరోవైపు దర్శనం ఇస్తాయి.
బాగ్ - ఏ - బహు :
జమ్మూ నగరంలో తావి నది ఒడ్డున ఉన్న అందమైన గార్డెన్ పేరే ఈ బాగ్ - ఏ - బహు. ముఘల్ గార్డెన్స్ మోడల్లో రూపొందించిన ఈ గార్డెన్ చూడచక్కటి ప్రదేశం. ఇక్కడి ప్రకృతి, ఫౌంటెన్స్, చెట్లు, పూల చెట్లు.. ఇలా ప్రతీది ఆస్వాదించదగినవే.
రంబిరేశ్వర్ టెంపుల్ :
రంబిరేశ్వర్ టెంపుల్ ఒక పురాతమైన శివాలయం. జమ్మూ సిటీలో ఉన్న ఈ ఆలయంలో శివుడిని ఆరాధిస్తారు. 1883లో అప్పటి అక్కడి మహారాజ రన్‌బీర్ సింగ్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు. అందుకే ఇది రంబిరేశ్వర్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది.
క్రిమ్చి టెంపుల్స్ :
క్రిమ్చి టెంపుల్స్ అనేది కొన్ని ఆలయాల సమూహం. ఇక్కడి ఆలయాన్ని కూడా 8 నుంచి 9వ శతాబ్ధం కాలంనాటివిగా చరిత్ర చెబుతోంది. మొత్తం జమ్మూకశ్మీర్ లోనే అత్యంత పురాతన ఆలయాలు ఇవేనని అక్కడి చరిత్రకారులు చెబుతుంటారు. వైష్ణోదేవి ఆలయం ఉన్న కాట్రాకు 60 కిమీ దూరంలో ఉన్న ఉందపూర్ లో ఈ క్రిమ్చి టెంపుల్స్ ఉన్నాయి.
మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తిన సిక్కు యోధుడి సమాధి :
కాట్రాకు 30 కిమీ దూరంలోని రీసికి సమీపంలో ' డేరా బాబా బండా ' ఉంది. డేరా బాబా బండా ఒక సిక్కు పుణ్యక్షేత్రం. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన బాబా బండా బహదూర్ అనే సిక్కు యోధుడి సమాది ఇది.