508 Not out in 178 Balls: మహారాష్ట్రకు చెందిన ఒక 13 ఏళ్ల క్రికెటర్ క్రికెట్ దిగ్గజాలను నివ్వెరపోయేలా చేశాడు. ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలకు వారి కెరీర్‌లో సాధ్యపడని అరుదైన స్కోర్ సాధించి సీనియర్స్‌ని ఔరా అని నోరెళ్లబెట్టేలా యశ్ చావ్డే చేశాడు. 178 బంతుల్లో 508 పరుగులు బాదడమే కాకుండా నాటౌట్‌గా నిలిచి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. క్రికెట్ చరిత్రలో 500కి పైగా పరుగులు చేసిన 10వ బ్యాటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అండర్-14 కేటగిరీలో ముంబై ఇండియన్స్ జూనియర్ ఇంటర్ స్కూల్ క్రికెట్ కప్‌లో సరస్వతీ విద్యాలయ తరపున బరిలోకి దిగిన యశ్ చావ్డే శుక్రవారం ఇండియాలో లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో జరిగిన ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో రెచ్చిపోయాడు. పూనకం వచ్చిన క్రికెటర్‌లా 81 ఫోర్లు, 18 సిక్సులతో స్టేడియం నలువైపులా భారీ షాట్లు కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నాగపూర్‌లోని జులేలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మైదానంలో సిద్ధేశ్వర్ విద్యాలయతో జరిగిన మ్యాచ్‌లో యశ్ చావ్డే ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.


ఈ అరుదైన ఘనత సాధించిన మరో నలుగురు భారతీయ బ్యాటర్‌ల జాబితాలో యశ్ చావ్డే చేరాడు. ప్రణవ్ ధనవాడే (1009 నాటౌట్), ప్రియాంషు మోలియా (556 నాటౌట్), పృథ్వీ షా (546), డాడీ హవేవాలా (515) వంటి ఇండియన్ క్రికెటర్స్ గతంలో ఈ రేర్ ఫీట్ సొంతం చేసుకున్న వారి జాబితాలో ఉన్నారు. 


సహచర బ్యాటర్ తిలక్ వాకోడే (97 బంతుల్లో 127)తో కలిసి యశ్ చావ్డే 40 ఓవర్లలో 714 పరుగుల అత్యధిక భాగస్వామ్యం రికార్డును బద్దలు కొట్టాడు. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో 500 పరుగులు చేసిన రెండో ఆటగాడు యశ్ చావ్డేనే కావడం గమనార్హం. 2022 ఆగస్టులో అండర్-15 ఇంటర్ స్కూల్ టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ చిరత్ సెల్లెపెరుమ 553 స్కోర్ చేసి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో 500 పరుగుల మైలు రాయి దాటిన మొదటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నట్టు సీనియర్ క్రికెట్ ఎనలిస్ట్ ఒకరు చెబుతున్నారు. 13 ఏళ్ల యష్ చావ్డే ఈ సీజన్‌లో U-16 VCA టోర్నమెంట్‌లో బ్రేకవుట్ స్టార్‌గా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో చావ్డే 2 సెంచరీలతో పాటు 1000 పరుగులు పూర్తి చేశాడు. మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్ కుమారుడు అయిన చావ్డేను అతని తండ్రే క్రికెట్‌లో ప్రోత్సహించడం గమనార్హం.


యశ్ చావ్డే గురించి అతడి స్కూల్ సూపర్‌వైజర్ కులకర్ణి మాట్లాడుతూ.. " చావ్డేకు క్రికెట్‌లో ఇంకెన్నో పెద్ద పెద్ద విజయాలు సాధించే సత్తా ఉందని ధీమా వ్యక్తంచేశాడు. చావ్డే క్రమశిక్షణ కలిగిన మంచి క్రికెటర్. 'క్రికెట్‌లో చావ్డేకు ఇంకెంతో కెరీర్ ఉంది" అని కితాబిచ్చాడు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యశ్ చావ్డే ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రికెట్ కాదట.. అతను స్కేటింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌లో కూడా పాల్గొనడం విశేషం.