ఇండియన్ టెస్ట్ క్రికెటర్ అజింక్య రహానే తండ్రి మధుకర్ బాబురావు రహానేని మహారాష్ట్రలోని కొల్లాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా వర్గాలు వెల్లడించిన కథనం ప్రకారం మధుకర్ బాబురావు రహానే డ్రైవ్ చేస్తోన్న వాహనం 4వ నెంబర్ జాతీయ రహదారిపై కంగల్ ప్రాంతం వద్ద ఓ మహిళను ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆశాతాయి కాంబ్లే అనే మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.


ఇదిలావుంటే, రోడ్డుపై తన హ్యాందాయ్ ఐ 20 కారుతో మహిళను ఢీకొట్టిన మధుకర్ బాబురావు రహానేని స్థానికులు అప్పటికే పోలీసులకి అప్పగించారు. మధుకర్ బాబురావు రహానే తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం ఐపీసీ 304 ఏ, 337, 338, 279, 184 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మధుకర్ బాబురావుని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.