భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శనివారం నుంచి జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఫ్లోరిడా వేదికగా ప్రారంభం కానుండగా అంతకన్నా ముందే విండీస్ జట్టుకు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఫ్లోరిడాలో జరగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండడం లేదని ఆ దేశ కీలక బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ ప్రకటించాడు. కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడిన రస్సెల్‌ను మోకాలి గాయం వేధిస్తున్నట్టు తెలుస్తోంది. కొంత అసౌకర్యం కారణంగానే తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండడం లేదని బోర్డుకు వెల్లడించాడు. రస్సెల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నవిండీస్ బోర్డు.. అతడి స్థానంలో జాసన్ మొహమ్మద్‌కు అవకాశం కల్పించింది. 


టీ20 క్రికెట్‌లో దిగ్గజంగా పేరొందిన రస్సెల్ లాంటి ఆటగాడి స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. అయితే, అదే సమయంలో జాసన్ మొహమ్మద్‌కి సైతం అన్ని ఫార్మాట్లలో మంచి అనుభవం ఉందని విండీస్ తాత్కాలిక కోచ్ ఫ్లాయిడ్ రీఫర్ తెలిపారు.