తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీ జ్యోతి సురేఖ సోమవారం విజయవాడలోని తన స్వగృహంలో నిరాహార దీక్ష చేయనున్నారు. శాప్ నుంచి తనకు ప్రోత్సాహం కరవైందని జ్యోతి సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నగదు ప్రోత్సాహకంపై ఆమె స్పందించారు.


2017లో తనకు కేంద్రం అర్జున అవార్డు ప్రకటించిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు రూ.కోటి నజరానా ప్రకటించారని.. ఇందులో ఇప్పటివరకు 22 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని జ్యోతి తెలిపారు. రూ.కోటి నుంచి రూ.15 లక్షలు కోచ్‌కి అందించి మిగిలిన రూ. 63 లక్షలను ఇస్తామని శాప్ అధికారులు చెబుతున్నారని.. ఇది తగదని ఆమె అంటున్నారు. అయినా చెరుకూరి సత్యనారాయణ తనకు కోచ్ కాదని ఆమె పేర్కొన్నారు. 2013 లోనే చెరుకూరి సత్యనారాయణ అకాడమీ నుంచి బయటకు వచ్చానన్నారు. తనను సంప్రదించకుండా నా కోచ్‌గా సత్యనారాయణను శాప్‌ నిర్ణయించిందని పేర్కొన్నారు. గతంలో సీఎం ప్రోత్సాహకం మొత్తాన్ని క్రీడాకారులకే అందించారని, తన విషయంలో మాత్రం అధికారులు ఎందుకిలా చేస్తున్నారో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.