ఆసియా క్రీడల్లో గురువారం భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మహిళల 4x400 మీటర్ల  రిలే రేసులో భారత జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ జట్టులో అథ్లెటిక్ దిగ్గజం హిమదాస్‌తో పాటు పువ్వమ్మ రాజు, సరితా బెన్, విస్మయ వెల్లువ కోరోత్ మొదలైన క్రీడాకారిణులు సభ్యులుగా ఉన్నారు. ఈ రేసును వీరు 3 నిముషాల 28.72 సెకన్లలో ముగించడం విశేషం. ఈ రిలే రేసులో తొలుత మొదటి పొజిషన్‌లో హిమదాస్ పరుగును మొదలుపెట్టగా.. తర్వాత ఆమెకు జట్టు సభ్యులందరూ బాగానే సహకరించి.. ఆటను ఆసక్తికరంగా మార్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌కు ఆసియా క్రీడల చరిత్రలో ఈ విభాగంలో పసిడి పతకం రావడం ఇది అయిదవసారి. హిమదాస్‌కు ఈ ఆసియా క్రీడల్లో ఇదే తొలి స్వర్ణ పతకం. ఈసారి ఆమె మహిళల 400 మీటర్ల పరుగు పందెంతో పాటు 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. హిమదాస్ 200 మీటర్ల సెమీ ఫైనల్స్‌లో డిస్ క్వాలిఫై అయ్యి ఉండకపోతే ఆమె ఖాతాలో కచ్చితంగా మరో పతకం చేరి ఉండేదే. 


తాజాగా మహిళల 4x400 మీటర్ల రేసులో పసిడి పతకాన్ని భారత్ సాధించగా.. తర్వాతి స్థానాల్లో బహ్రెయిన్, వియత్నాం దేశాలు ఉన్నాయి. వాటి తర్వాతి స్థానాలను చైనా, జపాన్, కజికిస్థాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు కైవసం చేసుకున్నాయి. అయితే పురుషుల 4x400 మీటర్ల రిలే రేసులో మాత్రం భారత్ రజత పతకాన్నే కైవసం చేసుకోవాల్సి వచ్చింది. 3 నిముషాల 56 సెకన్లలో ఖతర్ ఈ పోటీల్లో స్వర్ణం కైవసం చేసుకోగా.. 3 నిముషాల 18.5 సెకన్లలో రిలే పూర్తి  చేసిన భారత్ రజతం కైవసం చేసుకుంది.