బాల్ ట్యాంపరింగ్ నా వల్లే: వార్నర్ భార్య
బాల్ ట్యాంపరింగ్ ఘటన తనవల్లే జరిగిందని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ భార్య క్యాండిస్ వార్నర్ తెలిపారు.
బాల్ ట్యాంపరింగ్ ఘటన తనవల్లే జరిగిందని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ భార్య క్యాండిస్ వార్నర్ తెలిపారు. ఈ ఘటనకు తానే కారణమని, ఇది తనని చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'సిడ్నీ సండే టెలిగ్రాఫ్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, తన కళ్లముందు జరిగిన ఘటనలను, చూసిన దృశ్యాలను మరచిపోలేక పోతున్నానని ఆమె వాపోయారు.
తన భర్త చేసిన తప్పును తానేమీ సమర్ధించడం లేదని, భార్య, పిల్లలను రక్షించుకునే ప్రయత్నంలో అలా చేసాడన్నారు. 'ఆ సమయంలో నేను అక్కడ ఉంటే ఇలా జరిగేది కాదు. వార్నర్ ఒత్తిడికి లోనవ్వకుండా తనకు అండగా నిలిచేదాన్ని ' అని పేర్కొన్నారు. అభిమానులు, ప్రత్యర్ధి ఆటగాళ్లు తన మీద జోకులు వేస్తూ.. వార్నర్‌కు ఆగ్రహం తెప్పించేలా మాస్క్‌లు ధరించారని, ఇవి వార్నర్‌ను కంట్రోల్ తప్పేలా చేశాయని క్యాండిస్ చెప్పుకొచ్చారు.
వార్నర్ భార్య క్యాండిస్, న్యూజిలాండ్ రగ్బీ స్టార్ సోని బిల్ విలియమ్స్‌కు ఎఫైర్ ఉందని, 2007లో వీరిద్దరూ సిడ్నీలో గడిపారనే పుకార్లను మైదానంలో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్ వార్నర్‌ను రెచ్చగొట్టేలా ప్రస్తావించాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. స్టేడియంలో అభిమానులు కూడా ఈ ఎఫైర్ గురించి వ్యాఖ్యలు చేయడం, మాస్కులు ధరించడంతో.. వార్నర్ ఓటమి నుంచి తప్పించుకునేందుకు బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించాడని క్యాండిస్ అన్నారు. ఇంటికి వచ్చిన డేవ్, బెడ్ రూములో ఏడుస్తూ కూర్చుంటే, తన హృదయం బద్ధలైందని వ్యాఖ్యానించింది.
ఇక ట్యాంపరింగ్ పూర్తి బాధ్యత తనేదనని వార్నర్ శనివారం మీడియా ముందు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఆస్ట్రేలియా తరఫున ఆడనని, శాశ్వతంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అంశంపై కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నాడు.