బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆసీస్ క్రికెటర్
ఆసీస్ క్రికెటర్ కెమరాన్ బాంక్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ చేస్తూ ఎంపైర్లకు పట్టుబడ్డాడు.
ఆసీస్ క్రికెటర్ కెమరాన్ బాంక్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ఆసీస్ ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కెమెరా ఫుటేజీలో ఈ విషయం బహిర్గతం అవ్వడంతో అంపైర్లు బాంక్రాఫ్ట్‌ని ప్రశ్నించారు. అలాగే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ని కూడా అంపైర్లు ప్రశ్నించారు. కెమెరా ఫుటేజీకి సంబంధించిన తొలి క్లిప్పులో తన కుడి అరచేయితో బాల్‌ను రుద్దుతూ..ఆ తర్వాత ఏదో పసుపచ్చని వస్తువును తన కుడి పాకెట్‌లోకి పంపించినట్లు కనిపించింది.
రెండో క్లిప్పులో బాంక్రాఫ్ట్ వస్తువును పాకెట్‌లో పెట్టుకున్నాక.. ప్యాంటును సర్దుకున్నట్లు కనిపించింది. మూడవ క్లిప్పులో తన పాకెట్‌లో ఏదో పసుపచ్చని వస్తువును పెట్టుకున్నట్లు కనిపించింది. ఈ కెమెరా ఫుటేజీ చూసి బాంక్రాఫ్ట్‌ని ప్రశ్నించగా.. ఆయన తన పాకెట్‌లో ఉన్న పసుపు కలర్ సన్ గ్లాసెస్ తీసి చూపించాడు.
అంపైర్లు కూడా అతని పాకెట్‌లో ఉన్నవి సన్ గ్లాసెస్ అని నిర్థారణకు రావడంతో.. అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆటను కొనసాగించారు. అయితే చాలామంది టెలివిజన్ కామెంటేటర్లు ఈ వివాదాన్ని వదల్లేదు. కచ్చితంగా బాంక్రాఫ్ట్ బాల్‌ని ఏదో చేయడానికి ప్రయత్నించడానికి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై పలు చర్చలు కూడా జరిగాయి. పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ జరిగిందేమో అని ఆరోపించారు.