బోర్డుపై అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు..!
భారత క్రికెటర్ అజయ్ జడేజాకి గతంలో బీసీసీఐతో పలుమార్లు గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.
భారత క్రికెటర్ అజయ్ జడేజాకి గతంలో బీసీసీఐతో పలుమార్లు గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో బీసీసీఐపై ప్రశంసల వర్షం కురిపించారు. "గతంలో బీసీసీఐతో నాకు విభేదాలు ఉండి ఉండవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో బోర్డు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని ఫెడరేషన్లు బీసీసీఐ నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ళను ప్రోత్సహించడంలో ముందుంది కాబట్టి నేడు వారు కోరుకున్న విజయాలు సిద్ధిస్తున్నాయి" అని జడేజా బోర్డును పొగడ్తలతో ముంచెత్తారు.
భారత అంధ క్రికెటర్ల జట్టును వరల్డ్ కప్‌కు సిద్ధం చేసే ఈవెంట్‌కు హాజరైన ఆయన మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న భారత జట్టుకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 1992 నుంచి 2000 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడిన జడేజా దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత 2003 జనవరిలో ఢిల్లీ హైకోర్టులో కమిటీని సవాలు చేశాడు. నిషేధాన్ని సడలించడానికి అదే సంవత్సరం జడేజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు. బోర్డుపై విమర్శలు కూడా చేశాడు.