ప్రతీ ఏడాది నిర్వహించే వార్షిక సమావేశాల్లో భాగంగానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఈ ఏడాది లాహోర్‌లో నిర్వహించిన సమావేశానికి బీసీసీఐ( బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) గైర్హాజరైంది. ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య అనిశ్చిత వాతావరణం నెలకొని ఉన్నందున, భద్రతా కారణాల రీత్యా శనివారం లాహోర్‌లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి గైర్జారైనట్టు బీసీసీఐ తమకు సమాచారం అందించినట్టుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) పేర్కొన్నాయి. 


ఆసియా క్రికెట్ కౌన్సిల్ 35 ఏళ్ల చరిత్రలో బీసీసీఐ సమావేశానికి గైర్హాజరవడం ఇదే మొదటిసారి అని పీసీబీ స్పష్టంచేసింది. 33 దేశాలు సభ్యులుగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్‌‌లో భారత్ మాత్రమే గైర్హాజరైందని పీసీబీ అభిప్రాయపడింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ రిచర్డ్సన్ హాజరైన ఈ సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు నజ్ముల్ హసన్‌ని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2020 వరకు నజ్ముల్ హసన్ ఈ పదవిలో కొనసాగుతారు.