భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కమర్షియల్ పద్ధతులను ఆటలోకి చొప్పించడం వల్ల దాని నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఇంగ్లాండ్ బోర్డు ప్రతిపాదించిన 100 బాల్ ఫార్మాట్‌ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు 100 బాల్స్ ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని జట్లు ఈ ఫార్మాట్ క్రికెట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్డేలు, టెస్టులతో పాటు టీ20లు కూడా వచ్చాక క్రికెట్ ఫార్మాట్‌లు ఎక్కువైపోయానని.. మళ్లీ కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏముందని తెలిపాయి. కోహ్లీ కూడా తాను 100 బాల్స్ ఫార్మాట్ క్రికెట్ ఆడనని తెగేసి చెప్పారు. "నేను ఐపీఎల్ ఆడడానికి ఇష్టపడతాను. అలాగే బీబీఎల్ చూడడానికి కూడా ఇష్టపడతాను. ఆటలో నాణ్యత ఉన్నంతవరకూ నేను దానిని కచ్చితంగా ఇష్టపడతాను. ఒక పోటీతత్వంతో ఆడినప్పుడు క్రీడకు ఒక విలువ అనేది ఉంటుంది. అదే ఏ క్రికెటర్ అయినా కోరుకొనేది. కానీ కొత్త కొత్త ప్రయోగాలతో ఆట వైఖరి మార్చేస్తామంటే మాత్రం నేను సమర్థించను" అని ఆయన అన్నారు.


అయితే.. తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడానికి కూడా ఇష్టపడేవాడినని.. ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడడం ఒక అనుభూతి అని కోహ్లీ తెలిపారు. క్రికెట్ అనే ఆటను ప్రొఫెషనల్‌గా ఆడాల్సిన అవసరం ఉందని.. దాని విలువను తగ్గించకుండా ఆడితేనే ఆదరణ కూడా దొరుకుతుందని కోహ్లీ తెలిపారు.