చెన్నై: ఐపిఎల్ 2019 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభారంభానివ్వగా విరాట్ కోహ్లీ కెప్టేన్‌గా వున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు తొలి మ్యాచ్‌లోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగుళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు ఆరంభంలోనే బెంగళూరు జట్టు బ్యాట్స్‌మేన్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. జట్టు సారధి విరాట్ కోహ్లీ సహా బ్యాట్స్‌మేన్ అందరూ వరుసగా తడబడ్డారు. చెన్నై జట్టు బౌలర్ హర్బజన్ సింగ్ బెంగుళూరు బ్యాట్స్‌మేన్ విరాట్ కోహ్లీ, మొయిన్ అలీ, ఏబి డివిలియర్స్ వంటి మూడు కీలక వికెట్లు పడగొట్టి బెంగుళూరు జట్టు నడ్డి విరిచాడు. పార్థివ్ పటేల్ (39) మినహా కోహ్లీ (6), మొయిన్ అలీ (9), ఏబీ డివిలియర్స్ (9), హెట్‌మెయిర్ డకౌటయి వరుసగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో 70 పరుగులకే బెంగుళూరు జట్టు ఆలౌట్ అయింది.  చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్‌కు 3, ఇమ్రాన్ తాహిర్‌కు 3, జడేజాకు 2, డ్వాన్ బ్రావోకు 1 వికెట్ దక్కింది.


అనంతరం 71 పరుగుల లక్ష్యచేధనతో బ్యాటింగ్‌కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికే లక్ష్యాన్ని చేధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లలో అంబటి రాయుడు 28, సురేష్ రైనా 19 పరుగులు చేసి అవుట్ కాగా జడేజా 6, కేదార్ జాదవ్ 13 పరుగులతో నాటౌ‌ట్‌గా నిలిచారు.