చెన్నై: ఐపిఎల్ 2019 సీజన్ లో భాగంగా నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగుళూరు జట్టు తరపున పార్థివ్ పటేల్‌తో కలిసి ఆ జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించాడు. దీపక్ చాహర్ తొలి ఓవర్ బంతి విసిరి ఐపిఎల్ కి ఆరంభం పలికాడు. రెండో ఓవర్ లో బౌలింగ్ చేసిన భజ్జీ హర్బజన్ సింగ్ 7 పరుగులు ఇచ్చి వెను తిరిగినప్పటికీ.. మూడో ఓవర్ లో మరోసారి బంతి పట్టుకున్న భజ్జీ వచ్చీ రావడంతోనే విరాట్ కోహ్లీ (6) వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే మొయిన్ అలీ (9), ఏబి డివిలియర్స్ (9) వికెట్స్ సైతం పడగొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభారంభానిచ్చాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రోన్ సైతం డకౌట్ అయి వెనుతిరిగాడు. దీంతో తొలి మ్యాచ్‌లోనే కోహ్లి జట్టుకు వెంటవెంటనే కోలుకోలేని దెబ్బలు తగిలాయి. బ్యాటింగ్‌లో తడబడిన బెంగుళూరు జట్టు బౌలింగ్‌తోనైనా సమాధానం చెబుతుందో లేదో వేచిచూడాల్సిందే మరి.