వర్ష అంతరాయాల మధ్య బుధవారం ఫెరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఢిల్లీ జట్టు గెలుపొందింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవడంతో 18 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు చేసింది.  మళ్లీ వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం రాజస్థాన్ రాయల్స్‌కు 12 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని అంపైర్లు నిర్దేశించారు.


పృథ్వీ షా (47), శ్రేయస్ అయ్యర్(50), రిషబ్ పంత్ (69) మెరుపు బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లు పడగొట్టగా, కులకర్ణి, గోపాల్, అర్చర్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య చేధనలో బట్లర్ 67 పరుగులతో చెలరేగగా, షార్ట్  44 పరుగులతో అండగా నిలిచాడు. అయితే వీరి తర్వాత వచ్చిన ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్  నిర్ణీత 12 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే లక్ష్యాన్ని ఛేదించడానికి అద్భుతంగా పోరాడిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ పేరు తెచ్చుకుంది.