ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ఓ విచిత్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. తను వాడే బ్యాట్ హ్యాండిల్ టిప్ పై బూతు పదాలు రాసినందుకు ఆయనను ఐసీసీ మందలించింది. వివరాల్లోకి వెళితే.. తాను ఆడుతున్న ఓ టెస్టు మ్యాచ్‌లో భాగంగా డ్రింక్ విరామ సమయంలో.. బట్లర్ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ని కూడా గ్రౌండ్‌లో ఓ మూల భద్రపరిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో పలువురు ఆ హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను కూడా కెమెరా జూమ్ చేసి ఫోటో తీయడంతో.. బ్యాట్ హ్యాండిల్ టిప్ పై బూతు పదాలు కనిపించాయి. వెంటనే ఆ ఫోటోను కొందరు సోషల్ మీడియాలో లీక్ చేశారు. "చూశారా.. బట్లర్ తన బ్యాట్ పై ఏం రాశాడో" అని మెసేజ్ పెట్టి సోషల్ మీడియాలో ఆ ఫోటోను వైరల్ కూడా చేశారు. అయితే తన బ్యాట్ పై బూతులు రాసినందుకు బట్లర్ పై ఐసీసీ మండిపడింది.


తన బ్యాట్ పై ఏం రాయాలో.. రాయకూడదో అన్నది క్రికెటర్ ఇష్టమని.. కాకపోతే తన హుందాతనం, పరువుతో పాటు క్రికెట్ పరువును కూడా పణంగా పెట్టే ఇలా పనులకు క్రికెటర్లు పాల్పడకుండా ఉంటే బాగుంటుందని ఐసీసీ సూచించింది. మరోసారి ఇలా చేయవద్దని బట్లర్‌‌కి కూడా వార్నింగ్ ఇచ్చింది.