మాజీ భారతీయ క్రికెటర్ గోపాల్ బోస్ ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. 71 సంవత్సరాల బోస్ 1973-74 ప్రాంతంలో భారత జట్టు తరఫున ఆడారు. శ్రీలంకతో జరిగిన ఓ అనధికార మ్యాచ్‌లో బోస్, సునీల్ గవాస్కర్‌తో కలిసి 194 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తన కెరీర్‌లో 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బోస్.. 8 సెంచరీలు, 17 అర్థ శతకాలు చేశారు. అలాగే 3757 పరుగులు, 72 వికెట్లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. బెంగాల్ జట్టుకి కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 తన కెరీర్‌లో కొన్నాళ్లు మాత్రమే క్రికెట్ ఆడిన బోస్.. తర్వాత క్రికెట్ కోచ్‌గా కూడా సేవలందించారు. బెంగాల్ జట్టు సెలక్షన్ కమిటీ మెంబరుగా కూడా పనిచేశారు. 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలో కౌలాలంపూర్‌లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలచుకున్న భారత జట్టుకి మేనేజర్‌గా కూడా బోస్ పనిచేశారు. బెంగాల్ నుండి క్రికెటర్లుగా ఎదిగిన రణదీప్ బోస్, దేవాంగ్ గాంధీ, అవిషేక్ ఝుంఝుంవాలా మొదలైన వారికి బోస్ కోచింగ్ ఇచ్చారు. 


సౌరవ్ గంగూలికి బోస్‌తో చాలా అనుబంధం ఉంది. బెంగాల్ క్రికెట్‌కి ఎంతో కాలం సేవలందించిన బోస్‌కి గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ అయ్యాక.. జీవిత సాఫల్య పురస్కారం అందించారు. బోస్ మరణంపై సౌరవ్ గంగూలీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విటర్‌లో బోస్‌తో తనకున్న అనుబంధం గురించి తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని అందించారు.