ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ కన్నా ముందుగా తాను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ స్పష్టంచేశాడు. ఇంగ్లండ్ గడ్డపై అనే కాకుండా ఏ విదేశీ గడ్డపై కూడా తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదన్న కోహ్లీ... కేవలం జట్టుని గెలిపించాలన్న ధ్యేయమే తన మనసులో ఉంటుందని తేల్చిచెప్పాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్ గడ్డపై ఆతిథ్య జట్టుతో భారత్ ఆడబోతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కన్నా ముందుగా విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు విమర్శకులు చేసిన కామెంట్స్‌కి సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బుధవారం నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సందర్భంగా మంగళవారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.


2014లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు 10 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 134 పరుగులు మాత్రమే చేయడం అప్పట్లో అతడి సత్తాపై విమర్శలకు తావిచ్చింది. అయితే, ఆ తర్వాత కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ తన సత్తా చాటుకుని ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మేన్ అనిపించుకున్నాడు.