ఇంగ్లండ్‌‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. మూడో వ‌న్డేలో భారత్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో ముందుగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. భార‌త్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంత‌రం 257 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవ‌ర్లలో రెండు వికెట్ల న‌ష్టానికి గాను 260 ప‌రుగులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (71; 72 బంతుల్లో 7×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్‌ (44; 49 బంతుల్లో 7×4), ధోని (42; 66 బంతుల్లో 4×4) రాణించారు.


అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు మొదట్లో కాస్త తడబడినా మోర్గాన్(88), రూట్(100 నాటౌట్‌)లు రాణించడంతో మూడో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భార‌త్‌పై ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. మూడింటిలో రెండు మ్యాచ్‌ల‌ను గెలిచిన ఇంగ్లండ్.. సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. 2016 జనవరి తర్వాత భారత్‌కు ఇదే తొలి వన్డే సిరీస్‌ ఓటమి. కాగా.. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆగస్టు 1న బర్మింగ్‌హామ్‌లో ఆరంభమవుతుంది.