India Vs Ireland 2nd T20 Match Highlights: ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. దీంతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 152 పరుగులకే పరిమితమైంది. టీమిండియా ఇన్నింగ్స్‌ ఆఖర్లో మెరుపులు మెరిపించిన రింకూ సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ విధించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్‌లను ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ చేశాడు. ఆ తరువాత హ్యారీ టెక్టర్ (7)ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో మరింత కష్టాల్లో పడింది. తొలి 6 ఓవర్లలో ఐర్లాండ్ జట్టు స్కోరు 31 మాత్రమే ఉండగా.. ఓ ఎండ్ ఓపెనర్ ఆండ్రూ బల్‌బిర్నీ జట్టను ఆదుకునే ప్రయత్నం చేశాడు. 


కర్టిస్ కాంఫర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 63 పరుగుల స్కోరు కాంఫర్ (18)ను కూడా బిష్ణోయ్ ఔట్ చేసి మరో దెబ్బ తీశాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన జార్జ్ డాక్రెల్.. బల్‌బిర్నీకి చక్కటి సహకారం అందించాడు. బల్‌బిర్నీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 30 బంతుల్లో 52 పరుగులు జోడించారు. 115 పరుగుల వద్ద డాక్రెల్ (13) రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. కాసేపటికే ఓపెనర్ బల్‌బిర్నీ (72)ను అర్ష్‌దీప్‌ సింగ్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఐర్లాండ్ ఓటమి ఖరారు అయింది. చివరికి 8 వికెట్ల నష్టానికి 152 పరుగుల వద్ద ఆగిపోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, బుమ్రా, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (58) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ (18) వికెట్ పారేసుగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (1) మరోసారి విఫలమయ్యాడు. సంజూ శాంసన్ (40) రాణించాడు. చివర్లో రింకూ సింగ్ ( 21 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 22, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. చివరి మ్యాచ్ ఇదే వేదికపై మంగళవారం జరగనుంది.