ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన కివీస్‌.. రవిచంద్రన్‌ అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌ స్పిన్ దెబ్బకు 167 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ రోజు ఉదయం 27 పరుగులే చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే కివీస్ ఆలౌట్ అయింది. ఈరోజు జయంత్‌ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్‌ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్‌ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది అత్యంత భారీ విజయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (150; 311 బంతుల్లో 17x4, 4x6) సెంచరీ చేయగా.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీ బాదాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్‌ పటేల్‌ 10 వికెట్లు పడగొట్టాడు. 10/119 చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ (Jim Laker) మరియు టీమిండియా బౌలర్ అనిల్ కుంబ్లే (Anil Kumble)లు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు.


న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది భారత్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్‌. హైదరాబాద్ గల్లీ బాయ్ మొహ్మద్ సిరాజ్‌ (3/19) టాప్‌ ఆర్డర్‌ను కూల్చేయగా.. రవిచంద్రన్ అశ్విన్‌ (4/8), అక్షర్‌ పటేల్ (2/14) టెయిలెండర్ల పనిపట్టారు. కైల్ జేమిసన్ చేసిన 17 పరుగులే అత్యధికం. కివీస్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అవవ్వడంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఆపై న్యూజిలాండ్‌ జట్టును ఫాలోఆన్‌లో ఆడించకుండా భారత్ బరిలోకి దిగింది. రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్ (62; 108 బంతుల్లో 9x4, 1x6), చేతేశ్వర్ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) రాణించారు. శుభ్‌మన్‌ గిల్‌ (47; 75 బంతుల్లో 4x4, 1x6), విరాట్‌ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) పరుగులు చేయడంతో 276/7 స్కోర్‌ వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో న్యూజిలాండ్‌ ముందు భారత్ 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది


భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌.. మూడో రోజు ఆటనిలిచిపోయేసరికి 140/5తో నిలిచింది. ఆర్ అశ్విన్‌ మరోసారి మాయ చేయడంతో మూడో రోజే కివీస్ ఐదు వికెట్లు కోల్పోయింది. డారిల్‌ మిచెల్‌ (60; 92 బంతుల్లో 7x4, 2x6), హెన్రీ నికోల్స్‌ (44; 111 బంతుల్లో 8x4) మాతర్మే నాలుగో రోజు జట్టును ఆదుకున్నారు. ఇక సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ చెలరేగడంతో గంటలోనే మ్యాచ్‌ పూర్తయింది.