India vs West Indies 3rd T20 Preview: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేకున్నా.. అందరూ సమష్టిగా విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ మినహా మిగిలిన వారందరూ విఫలమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ పుంజుకోకపోతే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించాల్సిందే. అటు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచిన కరేబియన్ జట్టు.. మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని చూస్తోంది. 2016 తరువాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవిళ్లూరుతోంది. డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా పుంజుకుంటుందా..? విండీస్ జైత్రయాత్రను కొనసాగిస్తుందో చూడాలి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో మంగళవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్లో పిచ్‌లపై చెలరేగిపోతున్న కరేబియన్ బౌలర్ల జోరుకు కళ్లెం వేయాలంటే భారత బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడాల్సి ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ విఫలమవుతుండడం జట్టుపై భారాన్ని మోపుతోంది. వీరిద్దరు మెరుపు ఆరంభం అందిస్తే.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌పై భారం తగ్గుతుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం ఇబ్బందిగా మారింది. టాప్‌ ఆర్డర్ ఫ్లాప్‌ అవుతుండడంతో మిడిల్ ఆర్డర్‌పై మరింత ఒత్తిడి పడుతోంది. ఒత్తిడిలోనూ ఎలాంటి బెదురు లేకుండా తిలక్ వర్మ ఇన్నింగ్స్ నిర్మిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. రెండు మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోయాయినా.. మిడిల్ ఆర్డర్‌లో ఓ మంచి బ్యాట్స్‌మెన్ దొరకడం కాస్త ఊరట కలిగించే అంశం. సంజూ శాంసన్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. 


ఆల్‌రౌండర్‌గా మెప్పిస్తున్న హార్ధిక్ పాండ్యా.. కెప్టెన్‌గా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడు. గత మ్యాచ్‌లో చివర్లో చాహల్‌కు ఓవర్ ఇవ్వకపోవడం.. అక్షర్‌ పటేల్‌ను సద్వినియోగం చేసుకోకపోవడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. తన వ్యూహాలకు మరింత పదునుపెట్టాల్సి ఉంది. కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం ఖాయం. దీంతో రవి బిష్టోయ్‌ బెంచ్‌కే పరిమితం కావచ్చు. చాహల్‌కు తోడు కుల్దీప్ జట్టులో ఉంటే.. విండీస్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. ముఖేష్ కుమార్‌ను ఈ మ్యాచ్‌ నుంచి పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉమ్రాన్ మాలిక్ లేదా అవేశ్‌ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది.  


సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన విండీస్ జట్టు జోరు మీద ఉన్నా.. బ్యాటింగ్‌లో మరి అంతగొప్పగా ఏమీలేదు. నికోలస్ పూరన్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్ద ఆకట్టుకోవడం లేదు. హెట్‌మయర్‌ గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. టాప్‌ ఆర్డర్‌ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో విండీస్‌కు ఎలాంటి సమస్య లేదు. ఫాస్ట్ బౌలర్లు అల్జరీ జోసెఫ్‌, మెక్‌కాయ్, రొమరియో షెఫర్డ్‌, జేసన్ హోల్డర్‌, కైల్ మేయర్స్‌తో తోడు స్పిన్నర్ అకీల్  హోసేన్ కూడా రాణిస్తున్నాడు. ‌ 


తుది జట్లు ఇలా (అంచనా)..


భారత్‌: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేశ్‌ కుమార్/ఉమ్రాన్ మాలిక్/అవేశ్ ఖాన్


వెస్టిండీస్‌: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్