ఇంగ్లండ్‌ని ముప్పుతిప్పలు పెట్టే బౌలర్లు, బ్యాట్స్‌మేన్ టీమిండియా సొంతం
చెన్నైలో మీడియాతో మాట్లాడిన అనిల్ కుంబ్లె
ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్పిన్నర్లు టీమిండియా సొంతం అని భారత బౌలర్లకు కితాబిచ్చాడు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుకోగల ఆల్ రౌండర్స్, బ్యాట్స్‌మేన్ టీమిండియాలో ఉన్నారని చెబుతూ భారత ఆటగాళ్ల ప్రతిభా సామర్థ్యాలపై కుంబ్లే ధీమా వ్యక్తంచేశారు. టీమిండియా బౌలర్ల గురించి మరింత చెబుతూ వరుసగా 20 వికెట్లు తీసుకోగల సత్తా మన బౌలర్లలో ఉందన్నారు. ఇవన్నీ ఇంగ్లండ్ పర్యనలో ఇంగ్లండ్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టడానికి పనికొచ్చే అంశాలేనని కుంబ్లే అభిప్రాయపడ్డారు. త్వరలోనే ప్రారంభం కానున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కు సంబంధించి ఓ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విడుదల చేసేందుకు చెన్నైకి వచ్చిన సందర్భంగా కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలో కుంబ్లే మీడియాతో మాట్లాడుతూ.. "సగటున భారత ఆటగాళ్లంతా దాదాపు 50 వరకు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నవాళ్లే. అంతేకాకుండా ఇంగ్లండ్‌లో పర్యటించడం వాళ్లకు ఇదేం మొదటిసారి కాదు. అందరూ అక్కడ పర్యటించి వచ్చిన ఆటగాళ్లే. అక్కడి వాతావరణ పరిస్థితులపై పట్టున్న వాళ్లే. ముఖ్యంగా మణికట్టుతో మాయచేసే స్పిన్నర్లు ఈసారి ఇంగ్లండ్ పర్యటనలో కీలక పాత్ర పోషించనున్నారు" అని తెలిపారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ వంటి ఆటలు యువ ఆటగాళ్లకు తమలోని శక్తిసామర్థ్యాలను వెలికి తీయడానికి ఈ తరహా లీగ్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.