అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్..!
అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఎట్టకేలకు బదులు తీర్చుకుంది.
అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఎట్టకేలకు బదులు తీర్చుకుంది. సెమీ ఫైనల్లో పాక్‌ను కేవలం 69 పరుగులకే చిత్తు చేసి ఫైనల్‌కి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు కెప్టెన్ పృథ్వీ షా, మన్‌జోత్ కల్రా శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 89 పరుగులు అందించి పరుగుల వరద కురిపించారు.
అయితే 17వ ఓవర్‌లో కల్రా 47 పరుగుల వద్ద పెవిలియన్‌కి చేరుకోవడంతో కథ మలుపు తిరిగింది. అదే ఓవర్‌లో షా రన్ అవుట్ అవ్వడం మరో దెబ్బ. భారత్ 97 పరుగులకే రెండు ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాలలో ఉన్న సందర్భంలో... మ్యాచ్‌ను కాపాడడానికి అప్పుడే రియల్ హీరో వచ్చాడు. అతడే శుభ్‌మన్ గిల్. మొదటి నుండీ దూకుడుగా ఆడిన ఈ కుర్రాడు 108 స్ట్రయిక్ రేట్‌తో 94 బంతుల్లో 102 పరుగులు చేసి తన సత్తా చాటాడు.
దేశాయ్, రాయ్ మొదలైనవారు గిల్‌కి సరైన సహకారం అందివ్వడంతో భారత్ స్కోరు 272/9 గా నమోదైంది. అయితే చివరి నిమిషంలో టెయిలెండర్లు వరుసగా ఔట్ అవ్వడంతో భారత్ భారీ స్కోరు అయితే సాధించలేకపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ యువసేన, భారత్ బౌలర్లపై ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయింది. భారత్ బౌలర్ పోరెల్ ధాటికి పాక్ బ్యాట్స్‌మన్ బెంబేలెత్తిపోయారు. 69 పరుగులకే అందరూ అవుటయ్యారు.