India vs Afghanistan: అఫ్గానిస్థాన్‌పై రోహిత్ శర్మ ఊచకోత.. టీ20ల్లో సరికొత్త రికార్డు
IND Vs AFG 3rd T20 Score Updates: తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మూడో టీ20లో అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు చిన్నసామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. రింకూ సింగ్ కూడా చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది.
IND Vs AFG 3rd T20 Score Updates: అఫ్గానిస్థాన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. అఫ్గాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. రోహిత్ సూపర్ సెంచరీకి తోడు రింకూ సింగ్ చితక్కొడడంతో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (69 బంతుల్లో 121, 11 ఫోర్లు, 8 సిక్సర్లు), రింకూ సింగ్ (39 బంతుల్లో 69, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ శతకంతో టీ20ల్లో అత్యధిక (5) సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 4.3 ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రోహిత్ శర్మ, రింకూ సింగ్ అద్భుత బ్యాటింగ్‌తో భారీ స్కోరుకు బాటలు పరిచారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), శివమ్ దూబె (1), కోహ్లీ, సంజు శాంసన్ డకౌట్ అయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ 3 వికెట్లు తీయగా.. ఒమర్జాయ్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు భారత్‌ను అఫ్గాన్ బౌలర్లు భయపెట్టారు. పేసర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి గట్టి దెబ్బ తీశాడు. జైస్వాల్‌ను 4 పరుగులకే ఔట్ చేసిన ఫరీద్.. విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్‌లను గోల్డెన్ డకౌట్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న శివమ్ ధూబే కూడా ఒక పరుగుకే వెనుతిరిగాడు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడతో కనీసం వంద అయినా దాటుతుందా అని అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే రోహిత్ శర్మ, రింకూ సింగ్ ఆ అనుమానాలను పటాపంచలు చేశారు. ఆరంభంలో కాస్త వికెట్ కాపాడుకున్న ఈ జోడి.. తరువాత నెమ్మదిగా గేరు మారుస్తూ.. ఆఖర్లో విధ్వంసం సృష్టించారు.
రోహిత్ శర్మ, రింకూ సింగ్ కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో వీరిద్దరు విధ్వంసం సృష్టించారు. 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 109 పరుగులు ఉండగా.. మ్యాచ్ ముగిసే సమయానికి 212 పరుగులు చేసిందంటే.. చివర్లో ఎలా చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ఐదు ఓవర్లలోనే 103 పరుగులు పిండుకున్నారు. చివరి ఓవర్‌లో ఏకంగా 36 రన్స్ రాబట్టడం విశేషం. కరీం జనత్ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టగా.. చివరి మూడు బంతులను రింకూ సింగ్ సిక్సర్లుగా మలిచాడు.
Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter