టీమిండియా రథసారథి విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడి టీమిండియాకు విజయాలను అందించడంలోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లతో బిజీగా వున్న టీమిండియా కెప్టేన్ ఇటీవల ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేయడంతో ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. అవును, 2018లో ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 1404 అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలవగా ఆ తర్వాత 1389 పరుగులతో ఇంగ్లండ్‌కి చెందిన జానీ బెర్‌స్టో రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక ముచ్చటగా మూడో స్థానంలో ఇంగ్లండ్ కెప్టేన్ జో రూట్ 1338 పరుగులు పూర్తిచేశాడు.


ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మరో ఇండియన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతడే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్. ఈ జాబితాలో పాకిస్తాన్ సెన్సేషన్ బాబర్ అజం 4వ స్థానంలో ఉండగా 1055 పరుగులతో శిఖర్ ధావన్ 5వ స్థానంలో ఉన్నాడు.