ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయం అందుకుంది. ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరో అపూర్వమైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. వర్షం కారణంగా ఆట కొంత ఆలస్యంగా ప్రారంభమవగా.. లంచ్ బ్రేక్ తర్వాత నిన్నటి స్కోరుకి మరో 2 పరుగులు మాత్రమే జోడించిన కమిన్స్(63) జస్ప్రిత్ బుమ్రా విసిరిన బంతికి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో నాథన్ లియాన్ సైతం వెనుదిరిగాడు. అలా ఆసీస్ 261 పరుగులకే ఆలౌట్ అవడంతో 137 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ -ఆసిస్ టెస్ట్ సిరీస్ 2-1కి చేరింది. 1985 నుంచి భారత జట్టు బాక్సింగ్ డే టెస్ట్ ఆడుతుండగా.. 33 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటివరకు ఆసిస్‌తో భారత్ ఎనిమిదిసార్లు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడగా భారత్ మొదటిసారి విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్స్, 2వ ఇన్నింగ్స్‌లో 3 వికెట్స్ తీసిన జస్ప్రిత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా చివరిదైన 4వ టెస్ట్ మ్యాచ్ జనవరి 3న జరగనుంది. టీ 20 సిరీస్‌లో 3వ మ్యాచ్‌కి వేదికైన సిడ్నీ స్టేడియం ఈ చివరి మ్యాచ్‌కి వేదిక కానుంది.