ఐపీఎల్ 2018 సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను నియమిస్తున్నట్లు సన్‌రైజర్స్‌ యాజమాన్యం ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్, స్మిత్‌లపై ఏడాదిపాటు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)నిషేధించిన నేపథ్యంలో డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఈ సీజన్లో కెప్టెన్‌గా ఉండటానికి అంగీకరించాను. ప్రతిభావంతులైన ఆటగాళ్ల జట్టుతో ఉండటం అద్భుతమైన అవకాశం." అని విలియమ్సన్ ఒక ప్రకటనలో తెలిపాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కెప్టెన్‌గా  స్మిత్‌ను  తప్పించి  అజింక్య రహానేను నియమించుకున్న సంగతి తెలిసిందే..!  విలియమ్సన్ నియామకంతో ఈఏడాది జరిగే ఐపిఎల్‌లో అతడే విదేశీ కెప్టెన్. ఏప్రిల్ 7న ముంబయిలో టీ20 టోర్నమెంట్ మొదలవుతుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ముంబయి వాంఖడే స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ జరగనుంది.


అంతకు ముందు బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆసీస్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ బాసటగా నిలిచాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున వార్నర్ కెప్టెన్సీలో ఆడిన విలియమ్సన్.. వార్నర్‌ స్వతహాగా చెడ్డ వ్యక్తి కాదని స్పష్టం చేశాడు. 'ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ చర్యను ఏ జట్టూ సమర్థించదు. కానీ వార్నర్ చెడ్డ వ్యక్తి కాదు. అతడు తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకున్నాడు. అలా చేసినందుకు వార్నర్‌ చాలా ఆవేదన చెందాడు. ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత వార్నర్‌తో నేను టచ్‌లోనే ఉన్నాను' అని విలియమ్సన్ తెలిపాడు.