ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో శ్రేయాస్ అయ్యర్ చేరాడు. గతంలో 2008లో గిల్‌ క్రిస్ట్‌(డెక్కన్‌ చార్జర్స్‌), 2013లో అరోన్‌ ఫించ్‌(పుణె వారియర్స్‌), 2016లో మురళీ విజయ్‌(కింగ్స్‌ పంజాబ్‌)లు తమ తొలి ఆటలో అర్థశతకం చేశారు. ఇప్పుడు అయ్యర్ నాలుగో వ్యక్తిగా నిలిచాడు. కాగా శుక్రవారం మ్యాచ్‌లో జట్టును గెలిపించిన అయ్యర్.. తొలి మ్యాచ్‌లో అధిక స్కోర్ చేసిన కెప్టెన్‌గా తొలిస్థానంలో ఉన్నాడు.


ఐపీఎల్‌ 2018 సీజన్‌లో ఢిల్లీ  డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌గా గౌతం గంభీర్‌ వైదొలగడంతో శ్రేయస్‌ అయ్యర్‌కు కెప్టెన్ బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ఢిల్లీజట్టుకి అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో కెప్టెన్‌గా వ్యహరించిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన నాల్గో క్రికెటర్‌గా అయ్యర్‌ నిలిచాడు. 23 ఏళ్ల అయ్యర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు 11వ కెప్టెన్.