హైదరాబాద్: ఐపిఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌కి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియమే వేదిక కానుందా అంటే అవుననే తెలుస్తోంది. మే 12న జరగనున్న ఈ మ్యాచ్ కోసం చెన్నై స్టేడియంలో ఐ, జే, కే స్టాండ్స్‌ని ప్రారంభించడానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణమని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. చెన్నై స్టేడియంలో క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుండగా విశాఖపట్నం స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనున్నాయి. మే 7న చెన్నైలో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది.


వాస్తవానికి ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు రెండూ హైదరాబాద్ లోనే జరుగుతాయని భావించినప్పటికీ.. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున మ్యాచ్‌ల భద్రతాపరమైన అవసరాల మేరకు పోలీసు సిబ్బందిని సమకూర్చడం పెనుసవాల్‌గా మారడంతో ఈ రెండు మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలోనే మ్యాచ్‌లను వైజాగ్‌కి తరలించినట్టు తెలుస్తోంది. ముందస్తుగా ప్రణాళికల్లో భాగంగా మే 8న ఎలిమినేటర్, మే 10న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు రెండూ వైజాగ్‌లోనే జరగనున్నాయని సమాచారం.