ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు సురేష్ రైనా (Suresh Raina). ఆపై దుబాయ్ నుంచి వ్యక్తిగత కారణాలతో భారత్‌కు తిరిగొచ్చేసి మరో షాకిచ్చాడు రైనా. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) రైనా సేవల్ని కోల్పోయింది. రైనాతో పాటు హర్భజన్ సింగ్ సైతం వ్యక్తిగత కారణాలతో భారత్‌కు తిరొచ్చేశాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ఏ క్షణంలోనైనా గుర్రం ఎగరావచ్చునని రైనాతో పాటు సీఎస్కే మేనేజ్‌మెంట్ కొన్ని రోజుల కిందట ప్రస్తావించారు. కానీ సీఎస్కే చర్యతో ఐపీఎల్ 2020 సీజన్‌లో రైనాకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి. 



చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల జాబితాలో స్టార్ ప్లేయర్ సురేష్ రైనా పేరును తొలగించారు. రైనాతో పాటు హర్భజన్ పేరును సీఎస్కే వెబ్‌సైట్ నుంచి ఈ సీజన్ ఆటగాళ్ల జాబితా నుంచి తొలగించింది. తద్వారా గుర్రం యూఏఈకి ఎగరావచ్చుననే వదంతులకు మేనేజ్‌మెంట్ తెరదించినట్లయింది. సీఎస్కే వైస్ కెప్టెన్‌గానూ రైనా సేవలందించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో రైనానే లీగ్ నుంచి తప్పుకున్నాడని, అందుకే ఆటగాళ్ల జాబితా నుంచి రైనా పేరును తొలగించినట్లు సీఎస్కే సీఈఓ కాశి విశ్వనాథన్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. 



చెన్నై ప్రదర్శనపై మాట్లాడుతూ.. త్వరలోనే సీఎస్కే పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైనా వైపు చూసే అవకాశమే లేదని, అతడు సొంతంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని ప్రస్తావించారు. రైనా నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అయితే చెన్నై ఆటగాళ్లకు మళ్లీ రేస్‌లోకి రావడం ఎలాగో తెలుసునంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రైనా ఆడే మూడో స్థానంలో డుప్లెసిస్ ఆడుతున్న విషయం తెలిసిందే. చెన్నై మూడు మ్యాచ్‌లాడగా ముంబైతో మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి, వరుసగా 2 మ్యాచ్‌లు ఓడి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe