IPL 2024 Telugu Cricketers: ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు, అదృష్టం ఎందరికి వరిస్తుందో
IPL 2024 Telugu Cricketers: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి వేలంలో ఎవరు ఎంత ధర పలుకుతారో ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో 11 మంది తెలుగు ఆటగాళ్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Telugu Cricketers: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి విదేశీ గడ్డ దుబాయ్‌లో వేలం జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీల్లో ఖాళీగా ఉన్న 77 స్లాట్స్ కోసం పోటీ పడుతున్న 214 మంది భారతీయ ఆటగాళ్లలో 11 మంది తెలుగు ఆటగాళ్లుండటంతో ఎంత ధర పలకనున్నారనేది ఆసక్తిగా మారింది.
దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనా వేదికగా ఐపీఎల్ 2024 సీజన్ 17 మినీ వేలం ఇవాళ మద్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ వేలానికి రెండు ప్రాధాన్యతలున్నాయి. ఒకటి తొలిసారి విదేశీ గడ్డపై జరగడం, రెండవది తొలిసారిగా ఓ మహిళ వేలం నిర్వహించనుండటం. ఐపీఎల్ వేలంలో ఈసారి 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పదకొండు మందిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృధ్వీరాజ్‌లకు ఇప్పటికే ఐపీఎల్ ఆడిన అనుభవముంది. హనుమ విహారి 24 ఐపీఎల్ మ్యాచ్‌లు, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ 2 మ్యాచ్‌లు ఆడారు.
తెలుగు క్రికెటర్ల వివరాలు
కేఎస్ భరత్, విశాఖపట్నంకు చెందిన 30 ఏళ్ల వికెట్ కీపర్ కం బ్యాటర్. ఇప్పటి వరకూ 10 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి ఒక హాఫ్ సెంచరీతో 199 పరుగులు సాధించాడు. గుంటూరుకు చెందిన 29 ఏళ్ల రోహిత్ రాయుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్ అనుభవం ఇంకా లేదు. కాకినాడకు చెందిన 30 ఏళ్ల హనుమ విహారి ఆల్ రౌండర్ బ్యాటర్. ఇప్పటి వరకూ 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 284 పరుగులు చేశాడు. ఇక గుంటూరుకు చెందిన 25 ఏళ్ల పృధ్వీరాజ్ యర్రా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్. ఇప్పటి వరకూ కేకేఆర్ తరపున 2 మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ తీశాడు.
ఇక 2022లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన 26 ఏళ్ల హైదరాబాదీ కుర్రోడు రాహుల్ బుద్ధి బ్యాటర్. ఈసారి వేలంలో ఎవరికి దక్కుతాడో చూడాలి. మరో హైదరాబాదీ ఆల్ రౌండర్ 29 ఏళ్ల రవితేజ, 24 ఏళ్ల మనీష్ రెడ్డి తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కన్పించనున్నారు. హైదరాబాదీ మీడియం పేసర్ 23 ఏళ్ల రక్షణ్ రెడ్డి, నిజామాబాద్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 23 ఏళ్ల అనికేత్ రెడ్డిలు ఐపీఎల్ వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్నారు. హైదరాబాదీ బ్యాటర్ 19 ఏళ్ల అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ 19 ఏళ్ల మురుగన్ అభిషేక్ ఐపీఎల్ వేలంలో దిగనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook