ఐపీఎల్ 11వ ఎడిషన్ వేడుకలు రంగరంగ వైభవంగా వాంఖడే స్టేడియంలో ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ వేడుకలను ఐపీఎల్ కమీషనర్ రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభించారు. హీరో వరుణ్ ధావన్ ఈ ఐపీఎల్ వేడుకల్లో తన తొలి ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గణపతి బొప్పా మోరియా పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే జుడువా, బద్రినాథ్ కీ దుల్హనియా సినిమాలలో పాటలకు కూడా ఆయన ఆడి పాడారు.  వరుణ్ ధావన్ తర్వాత ప్రఖ్యాత కొరియాగ్రాఫర్ ప్రభుదేవా.. వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. యంగ్ హీరో వరుణ్‌తో పోటీపడీ మరీ ఆయన డ్యాన్స్ చేశారు. తర్వాత హీరోయిన్ తమన్నా కూడా ఇదే వేదిక పై పలు పాటలకు ఆడి పాడింది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో పాటలతో పాటు "స్వింగ్ జరా" పాటకు కూడా ఆమె డ్యాన్స్ చేశారు.


ఈ ప్రదర్శనకు గాను ఆమె రూ.50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే హీరో హృతిక్ రోషన్ కూడా ఈ వేడుకల్లో ఆడిపాడారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చెన్నై, రాజస్థాన్ జట్లు రెండు సంవత్సరాల నిషేధం తరువాత మళ్లీ బరిలోకి దిగనున్నాయి. 2013 లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాక.. రెండు సంవత్సరాల పాటు ఈ రెండు జట్లు నిషేధానికి గురయ్యాయి.