MI Bowler Piyush Chawla surpassed Amit Mishra during IPL 2023 match against CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ వెటరన్ స్పిన్ బౌలర్‌ పియూష్‌ చావ్లా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. నేడు చెపాక్ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 2 వికెట్స్ పడగొట్టడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం పియూష్‌ చావ్లా ఖాతాలో 174 వికెట్లు ఉన్నాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ సీనియర్ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను వెనక్కు నెట్టి ముందుకు దూసుకొచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రమాదకర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను పియూష్‌ చావ్లా పెవిలియన్ చేర్చాడు. మ్యాచ్‌లోని తన మొదటి డెలివరీలోనే గైక్వాడ్‌ను చావ్లా బోల్తా కొట్టించాడు. దాంతో ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో 46 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ను బ్రేక్ చేశాడు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను  ఔట్ చేసి ముంబై ఇండియన్స్‌కు మరో వికెట్ ఇచ్చాడు. 21 పరుగుల వద్ద రహానే ఔట్ అయ్యాడు. మంచి ఫామ్లో ఉన్న ఇద్దరు బ్యాటర్లను చావ్లా ఔట్ చేశాడు. ఈ మ్యాచులో తన కోటా 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. 


ఇక ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్‌ బ్రావో టాప్‌లో ఉన్నాడు. బ్రావో ఖాతాలో 183 వికెట్స్ ఉన్నాయి. రాజస్థాన్‌ రాయల్స్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ (179) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. పియూష్‌ చావ్లా (174), అమిత్‌ మిశ్రా (172), లసిత్ మలింగ (170), రవిచంద్రన్ అశ్విన్‌ (170) వరుస స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు చహల్‌ కు అవకాశం ఉంది. ఈ సీజన్లో చహల్‌ మరో 5 వికెట్స్ తీస్తే అరుదైన రికార్డు నెలకొల్పుతాడు. బ్రావో ఐపీఎల్ ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 


ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం సాధించింది. సొంత మైదానంలో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి ముంబైపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచులో తొలుత ముంబై 139/8కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవాన్‌ కాన్వే (44; 42 బంతుల్లో 4 ఫోర్లు), రుతురాజ్‌ గైక్వాడ్ (30; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. శివమ్ దూబె (25; 17 బంతుల్లో 3 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో పీయూష్‌ చావ్లా రెండు, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ఆకాష్‌ మద్వాల్‌ చెరో వికెట్ పడగొట్టారు.


Also Read: Samantha Hot Pics: హీటేక్కిస్తున్న సమంత ఆసనాలు.. ఆ భంగిమలు చూస్తే అంతే సంగతులు!  


Also Read: Rohit Sharma Ducks in IPL: రోహిత్ శర్మ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్!