Delhi Capitals Beat Gujarat Titans By 5 Runs: వరుస విజయాలతో దూకుడు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ చెక్ పెట్టింది. ఉత్కంఠభరిత పోరులో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 130 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్..‌ 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 125 రన్స్‌కే పరిమితమైంది. చివర్లో తెవాటియా సిక్సర్ల వర్షం కురిపించి భయపెట్టించినా.. ఆఖరి ఓవర్‌ను ఇషాంత్ శర్మ అద్బుతంగా బౌలంగ్ చేసి జట్టును గెలిపించాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (59) చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా మిగిలాయి. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది మూడో గెలుపు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

131 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వృద్ధిమాన్ సాహా తొలి ఓవర్‌లోనే డకౌట్ అయ్యాడు. అద్భుత ఫామ్‌లో శుభ్‌మన్ గిల్ కూడా 6 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్న విజయ్ శంకర్ (6) కూడా ఈసారి నిరాశపరిచాడు. దీంతో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే ఆదుకుంటాడని అనుకున్న డేవిడ్ మిల్లర్ (0)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి భారీ దెబ్బ తీశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో మాత్రం కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పాతుకుపోయాడు.


అభినవ్ మనోహర్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు మెల్లిగా సింగిల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడు బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించుకుంటూ వెళ్లారు. దీంతో విజయంపై గుజరాత్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. చివరి 3 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన తరుణంలో అభినవ్ మనోహర్ (26)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేసి.. ఢిల్లీ శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో ఐదో వికెట్‌కు 63 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 


చివరి 2 ఓవర్లలో గుజరాత్ విజయానికి 32 పరుగులు అవసరం అవ్వగా.. మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొది. 19వ ఓవర్‌ నోకియా వేయగా.. మొదటి మూడు బంతులకు మూడు పరుగులే వచ్చాయి. అయితే చివరి మూడు బంతులను మాత్రం తెవాటియా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను గుజరాత్ చేతిలోకి తీసుకువచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్‌కు కేవలం 12 పరుగులే కావాలి. ఇషాంత్ శర్మ బౌలింగ్ చేయగా.. మొదటి మూడు బంతులకు మూడు పరుగులే వచ్చాయి. మూడు 9 పరుగులు అవసరం అవ్వగా.. స్ట్రైక్‌లో తెవాటియా ఉండడంతో గెలుపు గుజరాత్‌దే అనిపించింది. అయితే నాలుగో బంతికి తెవాటియా (20)ను ఇషాంత్ ఔట్ చేసి.. ఒక్కసారి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. 


ఆ తరువాత రెండు బంతులకు రషీద్ ఖాన్ నాలుగు పరుగులు చేయడంతో ఢిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చిరకు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (59,53 బంతుల్లో 7 ఫోర్లు) తన శైలికి భిన్నంగా ఆడి చివరి వరకు క్రీజ్‌లో నిలబడినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీయగా.. నోకియా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. 
    
అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే గుజరాత్ బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. వార్నర్ (2) రనౌట్ అవ్వగా.. సాల్ట్ (0), ప్రియామ్ గార్గ్ (10), రోసౌ (8), మనీష్ పాండే (1)లను మహ్మద్ షమీ ఔట్ చేసి భారీ దెబ్బ తీశాడు. దీంతో ఢిల్లీ జట్టు తొలి 6 ఓవర్లలో 23 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌లో కూర్చింది. ఆ తరువాత అక్షర్ పటేల్ (27) పర్వాలేదనిపించగా.. అమన్ హకీమ్ ఖాన్ (51, 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. రిప్పల్ పటేల్‌ (23, 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఖర్లో అదగొట్టాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులలు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది. షమీకే మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


Also Read: CM KCR: కల్లుగీత కార్మికులకు శుభవార్త.. ప్రత్యేక పథకం ప్రకటించిన సీఎ కేసీఆర్   


Also Read: Indore Crane Accident: ఘోర విషాదం.. క్రేన్ కింద పడి నలుగురు దుర్మరణం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి