దక్షిణాఫ్రికా విధ‍్వంసకర క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెటర్‌కి గుడ్‌బై చెప్పిన మరుసటిరోజే మరో క్రికెటర్‌ ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్టు ఐర్లాండ్‌ క్రికెటర్‌ ఎడ్మన్ క్రిస్టోఫర్ జాయిస్(39) స్పష్టంచేశాడు. ఐర్లాండ్‌లోని డుబ్లిన్‌కి చెందిన క్రికెటర్ అయిన ఎడ్ జాయిస్ గతంలో ఇంగ్లండ్‌ జట్టు తరపున సైతం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం విశేషం. రెండు దేశాల తరపున ఆడిన ఆటగాడు కావడంతో ఎడ్ జాయిస్‌ని డ్యూయల్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గానూ పిలుస్తారు. 2006లో జూన్‌13న ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన జాయిస్‌.. 2007 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లండ్ జట్టు తరపున ఆడాడు. మోడర్న్ గేమ్‌గా పేరున్న ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున ఆడే అవకాశం సొంతం చేసుకున్న మొట్టమొదటి ఐరిష్ ఆటగాడిగా అప్పట్లో ఎడ్ జాయిస్ రికార్డుకెక్కాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఇంగ్లండ్ తరపున ఎక్కువ కాలం ఆడని ఎడ్ జాయిస్ 2011 వరల్డ్ కప్ నాటికి తిరిగి ఐర్లాండ్ జట్టు చెంతనే చేరడం గమనార్హం. 2016లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎడ్ జాయిస్ చేసిన 160 నాటౌట్‌ అతడికి వన్డే కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడమే కాకుండా అంతర్జాతీయంగా పేరున్న క్రికెటర్లలో ఒకరిని చేసింది. 


ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్లకు రెండు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించిన ఎడ్ జాయిస్‌ మొత్తంగా 78 వన్డేలు, 18 టీ-20 మ్యాచ్‌లు, ఒకే ఒక టెస్ట్‌ మ్యాచ్‌(ఇటీవలే పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్) ఆడాడు. 78 వన్డేల్లో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని 2,622 పరుగులు సాధించాడు. మొత్తం 78 వన్డేల్లో ఐర్లాండ్‌ తరపున ఆడిన మ్యాచ్ లు 61 వన్డేలు. కేవలం ఐర్లాండ్ తరపున ఆడిన 61 వన్డేల్లో 41.36 సగటుతో 2121 పరుగులు చేశాడు. 


ఇంగ్లండ్ తరపున 17 వన్డేలు ఆడిన ఎడ్ జాయిస్ తన రిటైర్‌మెంట్ అనంతరం తన సమయాన్ని ఐర్లాండ్ క్రికెట్ అభివృద్ధికి అంకితం చేస్తానని ప్రకటించాడు. 255 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడి 47 శతకాల సాయంతో 47.95 సగటుతో 18,461 పరుగులు సాధించిన ఎడ్మన్ క్రిస్టోఫర్ జాయిస్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే కాకుండా కౌంటీల్లో ఇంగ్లాండ్ లయన్స్, మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌, మిడిల్‌సెక్స్‌, సస్సెక్స్‌లకు సైతం ఎడ్ జాయిస్ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్ కెరీర్‌లో పలు అరుదైన అవకాశాలు సొంతం చేసుకున్న ఎడ్ జాయిస్ ని క్రికెట్ వర్గాలు అతికొద్దిమంది స్పెషల్ క్రికెటర్స్‌లో ఒకరిగా భావిస్తుంటాయి.