ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లో ఆదివారం జరుగుతున్న 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో  బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. మలేషియా ఆటగాడు ఛాంగ్ వెల్ లీ 2-1 తేడాతో కిదాంబి శ్రీకాంత్ పై విజయం సాధించాడు. మొదటి సెట్‌ను శ్రీకాంత్  21-19 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. అయితే, ఆ తరువాత ఛాంగ్ లీ గట్టి పోటీనిచ్చాడు. రెండో సెట్ లో 21- 14తో నెగ్గిన మలేషియా క్రీడాకారుడు మూడో సెట్‌ను కూడా 21-14 తేడాతో కైవసం చేసుకున్నాడు.  మూడు సెట్ల ఈ మ్యాచ్‌ను 2-1 పాయింట్ల తేడాతో గెలుపొంది.. స్వర్ణ పతకాన్ని  ఛాంగ్ వెల్ లీ సాధించగా.. శ్రీకాంత్‌కు రజత పతకం లభించింది.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మహిళల స్క్వాష్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు రజత పతకం వచ్చింది. స్క్వాష్‌ డబుల్స్‌లో దీపిక-చిన్నప్ప జోడి రజతంతో సరిపెట్టుకుంది.ఆదివారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తలపడ్డారు. హోరోహోరీగా సాగిన ఈ  బాడ్మింటన్ ఫైనల్‌లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ గెలుపొందింది. సైనా నెహ్వాల్ 21-18, 23-21 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2010 తరువాత సైనాకు ఇది రెండో కామన్వెల్త్ స్వర్ణం.


కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటింది. మొత్తం 65 పతకాలతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 26 స్వర్ణ పతకాలు, 19  రజత పతకాలు, 20 కాంస్య పతకాలతో మొత్తం 65 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. కాగా, కామన్వెల్త్ గేమ్స్ నేటితో ముగియనున్నాయి.