ఫ్రెంచ్ ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ విజయం
భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో మరో చరిత్ర తిరగరాయబడింది. కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోని 21-14, 21-13 స్కోరుతో ఫైనల్‌లో ఓడించడంతో ఫ్రెంచి ఓపెన్ టైటిల్ అతని సొంతమైంది. తద్వారా ఈ సంవత్సరం అతని ఖాతాలో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నమోదయ్యాయి. గత వారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న శ్రీకాంత్.. వరుసగా రెండో టైటిల్ కూడా కైవసం చేసుకోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన శ్రీకాంత్ నవంబరు 2014న తొలిసారిగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లోనే అత్యుత్తమ క్రీడాకారుడు మరియు "సూపర్ డాన్"గా పిలివబడే లిన్ డాన్ ను 21-19 21-17 తేడాతో ఓడించి చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ గెలుచుకున్నాడు.
అలాగే 2015లో స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా వార్తలలోకి ఎక్కాడు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్న శ్రీకాంత్ ఈ సంవత్సరం ఇండోనేషియా సూపర్ సిరీస్‌తో పాటు, ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్, డెన్మార్క్ సూపర్ సిరీస్ కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు.