భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి క్రికెట్ చరిత్రలో ఎలాంటి స్థానం ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే సమయపాలన విషయంలో ఆయనకు, అలనాటి మేటి క్రికెటర్ రవిశాస్త్రికి మధ్య ఒక వివాదం జరిగిందట. అసలు వివరాల్లోకి వెళితే.. 2007 బంగ్లాదేశ్ టూర్ సమయంలో రవిశాస్త్రి భారతీయ జట్టుకి మేనేజరుగా వ్యవహరించేవారు. ఆ సమయంలో ఆయన కావాలనే గంగూలీకి ఓ గుణపాఠం నేర్పారట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఈ విషయాన్ని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నేను ఒక క్రికెటర్‌గా సమయపాలనకు పెద్దపీట వేస్తాను. ఏ జట్టుకైనా పంక్చువాలిటీ అనేది అతి ముఖ్యమైనది. అది మనకు క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. బంగ్లాదేశ్ టూర్‌లో ఉన్నప్పుడు.. షెడ్యూల్ ప్రకారం మేము చిట్టగాంగ్ ప్రాంతానికి రాత్రి తొమ్మిది గంటలకు చేరాల్సి ఉంది. కానీ గంగూలీ ఇంకా అనుకున్న స్పాట్‌కి రాలేదు. చాలా సేపు వేచి చూశాక నేను లోకల్ మేనేజర్లకు బయలుదేరిపోదామని చెప్పాను. వారు "దాదా ఇంకా రాలేదు సార్" అన్నారు. కానీ నేను మాత్రం "దాదా వెనుక కారులో వస్తాడు. మనం తక్షణం ఇక్కడ నుండి వెళ్లాల్సిందే" అని చెప్పి అందరూ సరైన సమయానికి గమ్యం చేరేలా చూశాను" అన్నారు రవిశాస్త్రి. 


ఈ సంఘటన జరిగాక గంగూలీ బాగా ఫీలయ్యారని.. ఆ తర్వాత జట్టుకి సంబంధించిన ఏ విషయంలోనూ ఆయన క్రమశిక్షణను, సమయపాలనను మర్చిపోలేదని.. అనుకున్న సమయానికి ముందుగానే గ్రౌండ్‌కి చేరుకొనేవారని తెలిపారు రవిశాస్త్రి.