మొహమ్మద్ షమికి గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ
తన భార్య హసిన్ జహాన్ చేసిన అనేక ఆరోపణలతో సతమతమవుతున్న టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమికి నిజంగానే ఇదో భారీ గుడ్ న్యూస్.
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమికి బీసీసీఐ నుంచి ఊరట లభించింది. షమిపై అతడి భార్య హసీన్ జహాన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం.. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాకుండా మొహమ్మద్ షమిపై వున్న అనుమానాలు తొలిగిపోవడంతో బీసీసీఐ అతనికి ఈ ఏడాది కాంట్రాక్ట్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రేడ్ -బీ కాంట్రాక్ట్ కింద అతనికి ఏడాదికి రూ.3 కోట్ల పారితోషికం అందనుంది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరపున ఆడేందుకు సైతం బీసీసీఐ నుంచి అనుమతి లభించింది.
తన భర్త మొహమ్మద్ షమి తనను మోసం చేశారని, ఆయన మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడి దేశాన్ని సైతం మోసగించారని హసిన్ జహాన్ చేసిన ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ అదే సమయంలో ప్రకటించిన 2018 కాంట్రాక్ట్ ప్లేయర్స్ జాబితాలో అతడి పేరుని చేర్చకూడదనే నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అతడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ నీరజ్ కుమార్‌ని ఆదేశించింది. అలా నీరజ్ కుమార్ ఇచ్చిన నివేదిక మేరకు మొహమ్మద్ షమిని నిరపరాధిగా భావిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.