రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ మహ్మద్ షమీకి గాయాలు
రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ మహ్మద్ షమీకి గాయాలయ్యాయి. షమీ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ మహ్మద్ షమీకి గాయాలయ్యాయి. షమీ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో షమీ తలకు గాయాలయ్యాయి. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తలకు గాయమైన షమీని ఆస్పత్రికి తరలించారు. డెహ్రడూన్‌లో చికిత్స తీసుకుని అక్కడే షమి విశ్రాంతి తీసుకుంటున్నాడని సన్నిహితులు తెలిపారు. షమీ సురక్షితంగా ఉన్నాడని, అతడి తలకు కుట్లుపడ్డాయని చెప్పారు.
భార్య హసీన్ జహాన్ ఆరోపణలతో వ్యక్తిగత జీవితంలో షమీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. తన భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయని, క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని షమీపై భార్య హసీన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! తనను చిత్రహింసలు పెట్టాడని, హత్యాయత్నం కూడా చేయబోయాడని కూడా ఆమె వెల్లడించింది. అయితే జహాన్ ఆరోపణలను షమీ తోసిపుచ్చాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా మొదట బీసీసీఐ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో మానసిక క్షోభ అనుభవించాడు షమీ. ఆ తరువాత భార్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో కాంట్రాక్టును పునరుద్ధరించారు.