మాజీ భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మరో మైలురాయిని అధిగమించాడు. వన్డే క్రికెట్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో వికెట్‌ కీపర్‌గా ఘనత సాధించాడు. రెండో వన్డేలో 37 పరుగులు చేసిన అతడు, 33 పరుగుల వద్ద ఈ మైలురాయిని చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్ ఫ్లంకేట్ బౌలింగ్ లో సింగల్ తీసి ఈ ఘనతను సాధించాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా ధోని నిలిచాడు. ధోని కంటే ముందుగా సచిన్‌ (463 మ్యాచ్‌ల్లో 18,426), ద్రవిడ్‌ (311 మ్యాచ్‌ల్లో 11,363), గంగూలీ (344 మ్యాచ్‌ల్లో 10,889) ఈ రికార్డును అందుకున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


10 వేల క్లబ్‌లో చేరిన 12వ బ్యాట్స్‌మెన్‌


 ఓరాల్‌గా వన్డే క్రికెట్‌ చరిత్రలో 10 వేల క్లబ్‌లో చేరిన అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో మిస్టర్ కూల్ 12వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం దిగ్గజ క్రికెటర్ సచిన్ వన్డేల్లో 18,426 పరుగులతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర (14,234), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13,704), శ్రీలంక ఆటగాళ్లు సనత్ జయసూర్య(13,430), మహేల జయవర్దనే(12,650), పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ హుల్ హక్(11,739), సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కలీస్(11,579), గంగూలీ(11,363), ద్రవిడ్(10,889), బ్రియన్ లారా(10405), శ్రీలంక ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్(10,290) ఈ జాబితాలో ఉన్నారు.


10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో వికెట్‌ కీపర్‌


వన్డే క్రికెట్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో వికెట్‌ కీపర్‌గా ధోని ఘనత సాధించాడు. ధోని కంటే ముందు 10 వేల మార్క్‌ను అందుకున్న వికెట్‌కీపర్‌.. సంగక్కర మాత్రమే. 2015లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగక్కర 13,341 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు.


300 క్యాచ్‌ల క్లబ్‌లో చేరిన నాలుగో వికెట్‌ కీపర్‌


అంతకుముందు 300 క్యాచ్‌ల క్లబ్‌లో చేరాడు.ఈ ఘనతకెక్కిన నాలుగో వికెట్‌ కీపర్‌గా ధోని నిలిచాడు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ గ్రౌండులో జరుగుతున్న రెండవ వన్డేలో బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ పట్టి ఆయన ఈ ఘనత సాధించాడు. గిల్‌క్రిస్ట్‌ (417),  మార్క్ బౌచర్‌ (403), కుమార సంగక్కర (402) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ధోని తర్వాతి స్థానంలో 262 క్యాచ్‌లతో బ్రెండన్ మాకల్లమ్ ఉన్నారు. గతంలో ధోని ఇంగ్లాండుతో జరిగిన టీ20ఐ సిరీస్‌లోనే ఆ ఫార్మాట్ క్రికెట్‌లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపరుగా రికార్డు సాధించారు.


మరెన్నో  రికార్డులు...
ఇవే కాకుండా ధోని పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. గతంలో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో అధిక స్టంపింగ్‌లు(178) చేసిన వికెట్‌ కీపర్‌గా కూడా వార్తలలోకెక్కాడు. అలాగే భారత జట్టు తరపున ఆరు ప్రపంచ టీ20 టోర్నీలకు రథసారధిగా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌ కూడా ధోనియే. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌ ధోని. అలాగే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక శతకాలు చేసిన క్రీడాకారుడిగా కూడా ధోని రికార్డు నమోదు చేశాడు. అలాగే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండు సెంచరీలు చేసిన సూపర్ క్రికెటర్ కూడా ధోనియే.