హైదరాబాద్: ఐపిఎల్ 2019 సీజన్‌ ముగిసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరిగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఘన విజయం సాధించి నాలుగవసారి ఐపిఎల్ టైటిల్‌ని కైవసం చేసుకుంది. చెన్నై జట్టును గెలిపించాలని ఆ జట్టు బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ పడిన కృషి ముంబై బౌలర్ల అద్భుత ప్రదర్శన ముందు వృధానే అయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కృనాల్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన డుప్లెసిస్(26) చివరి బంతికి స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ చాహర్ వేసిన 10వ ఓవర్ రెండో బంతికే సురేష్ రైనా(8) ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 11వ ఓవర్‌లో బుమ్రా విసిరిన మూడో బంతికే అంబటి రాయుడు (1) కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం కెప్టేన్ ధోనీ(8) సైతం రనౌట్ అయ్యాడు. 


భారీ స్కోర్ చేయకుండానే ఒక్కొక్కరుగా బ్యాట్స్‌మన్ అందరూ పెవిలియన్ బాట పడుతుండటంతో కష్టాల్లోపడిన జట్టు షేన్ వాట్సన్ అండగా నిలిచి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్‌లో విజయానికి మరో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. 4వ బంతికి వాట్సన్ (80) రనౌట్ అయ్యాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేయడంతో అంతిమంగా ముంబై ఇండియన్స్ జట్టునే విజయం వరించింది.