ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠతతో సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 167 పరుగుల టార్గెట్‌ను భారత్ చివరి ఓవరులో దినేష్ కార్తిక్ చూపిన డేరింగ్ షాట్ల వల్ల పూర్తి చేసింది. ఈ మ్యాచ్ ద్వితీయార్థంలో భారత బ్యాట్స్‌మన్ రెచ్చిపోయి ఆడడంతో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.  వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ 29 పరుగులు చేసి 8 బంతుల్లో నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లు బాదడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. భారత్ ముంగిట్లో సందడి చోటు చేసుకుంది. అంతకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు.


అయితే మ్యాచ్ మొత్తం చివరి ఓవరులో దినేశ్ కార్తిక్ చూపిన పోరాట పటిమ వల్లే మలుపు తిరిగిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో రుబేల్ 2 వికెట్లు తీసి ఫరవాలేదనిపించుకున్నాడు ప్రథమార్థంలో మొత్తం భారత్ బౌలర్ల హవాయే కొనసాగింది. భారత బౌలర్లలో యజువేంద్ర చాహెల్ 3 వికెట్లు తీయగా, ఉన్కదత్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ తరఫున వారి బ్యాట్స్‌మన్లు షబ్బిర్ రెహ్మాన్ (77), మహ్మదుల్లా (21) మాత్రమే రాణించారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడం బంగ్లాదేశ్ కష్టాలకు కారణమైంది